చెత్తను తెచ్చారు: చిరంజీవిపై జగన్ వర్గం కొండా సురేఖ వ్యాఖ్య

పీఆర్పీ ఎమ్మెల్యేలే ఆయన వెంట లేరని చెప్పారు. కాంగ్రెసు పార్టీనుండి విడిపోయి మళ్లీ కాంగ్రెసులో విలీనం అయిన పార్టీలు ఉన్నాయి. కానీ కొత్తగా స్థాపించిన పార్టీ గడప తొక్కడం 125 సంవత్సరాల కాంగ్రెసుకు దురదృష్టకరమన్నారు. చిరు కాంగ్రెసులో చేరడం ఆయన పార్టీకి ఓట్లు వేసిన 70 లక్షల మంది ఆమోదమే అయితే చిరుతో పాటు ఆయన ఎమ్మెల్యేలు రాజీనామా చేసి కాంగ్రెసు గుర్తుపై గెలవాలని సవాల్ విసిరారు. ఇంట్లో ఉన్న బంగారాన్ని బయటకు పంపించి, చెత్తను తెచ్చుకున్నారని జగన్, చిరులను ఉద్దేశించి చెప్పారు. సమైక్యవాది అయిన చిరును కలుపుకోవడం వల్ల కాంగ్రెసు తెలంగాణ ఇవ్వకూడదని అనుకుంటుందా అని ప్రశ్నించారు. వైయస్ అధిష్టానానికి పీఆర్పీ విలీనంపై లేఖ రాస్తే చిరుకు తెలియకుండా ఎలా ఉంటుందన్నారు. వైయస్ మరణించినప్పుడు సంతకాల సేకరణ విషయంలో జగన్‌కు సంబంధం లేదని స్పష్టం చేసారు. మంత్రుల అభివృద్ధిపై కాకుండా జగన్‌పై దృష్టి పెడుతున్నారన్నారు. మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డిపై కూడా ఆమె విరుచుకు పడ్డారు.
రాజీవ్‌గాంధీ, ఇందిరాగాంధీలపై మాకు ఎప్పుడూ అభిమానం ఉందని, సోనియాపై కూడా నిన్నటి వరకు ఉండేదని, అయితే వైయస్ కుటుంబాన్ని ముక్కలు చేసిన కారణంగా ఆమె గౌరవం కోల్పోయిందన్నారు. మేం తప్పు చేశామా లేదా అనే విషయాన్ని ప్రజలు తేల్చుతారన్నారు. డిఎస్‌తో మంతనాలు జరిపినట్టు నిరూపించినా, జగన్‌తో ఆర్థిక లావాదేవీలు మాకు ఉన్నట్టు నిరూపిస్తే మేం వరంగల్ నుండి వెళ్లిపోవడమే కాకుండా, రాజకీయాలనుండి తప్పుకుంటామని, అయితే నిరూపించలేకుంటే ఎబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ మూసి వేసుకుంటుందా అని సవాల్ చేశారు. డిఎస్ సామాజిక వర్గం చెందిన వ్యక్తిని కాబట్టి ఆయనను మంచి పదవిలో చూసుకోవాలని అనుకుంటున్నట్టు చెప్పారు. వైయస్ తర్వాత మేం అభిమానించే వ్యక్తి డిఎస్ అన్నారు. జగన్ చెబితే మేం చేసే వాళ్లం కాదన్నారు.
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరని, శాశ్వత మిత్రులు ఉండరని అన్నారు. జగన్‌తో హరితయాత్రలో పాల్గొననంత మాత్రాన జగన్‌కు మద్దతు ఇవ్వనట్టు కాదన్నారు. మేం ఎప్పుడూ జగన్ వెంటే ఉంటామన్నారు. ఆయన సమైక్యవాది కాదన్నారు. ఆయన తన వాయిస్ ఇంకా చెప్పలేదన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి రచ్చబండ కార్యక్రమం జన్మభూమిని తలపిస్తుందన్నారు. తెలంగాణ ప్రాంతంలో రచ్చబండ కార్యక్రమం వద్దనే వాదనతో నేనూ ఏకీభవిస్తున్నానని చెప్పారు. మంత్రులు ఒకరికి ఒకరు సమన్వయం లేకుండా మాట్లాడుతున్నారన్నారు. వైయస్ అవినీతిపరుడుని చిరంజీవి చేసిన ఆరోపణలు ఒక్క మంత్రి ఖండించలేదన్నారు. కాంగ్రెసు పార్టీకి సరియైన నాయకుడు కరవయ్యాడన్నారు. ఈ ప్రభుత్వం 2014 వరకు కొనసాగవచ్చు, కొనసాగక పోవచ్చునన్నారు. అయితే కాంగ్రెసుకు తమ మద్దతు ఉంటుందని చెప్పారు.