• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

శ్రీకృష్ణ కమిటీకి చట్టబద్దత లేదు: హైకోర్టులో వాహనవతి

By Pratap
|
Google Oneindia TeluguNews
BN Srikrishna
హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ఏర్పాటైన శ్రీకృష్ణ కమిటీకి చట్టబద్ధతలేదని, కమిషన్స్‌ ఆఫ్‌ ఎంక్వైరీస్‌ చట్టం కింద ఆ కమిటీ ఏర్పాటు కాలేదని అటార్నీ జనరల్‌ (ఏజీ) గులాం ఇ.వాహన్‌వతి స్పష్టం చేశారు. అది కేవలం సంప్రదింపుల కమిటీ మాత్రమేనని, దాని పరిధి కూడా తక్కువేనని తెలిపారు. ఆ కమిటీ ఇచ్చిన సలహాలను తప్పనిసరిగా అమలుచేయాల్సిన అవసరం లేదని, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుందన్నారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికలోని 8వ అధ్యాయాన్ని వెల్లడించాలంటూ నిజామాబాద్‌కు చెందిన న్యాయవాది, మాజీ ఎంపీ ఎం.నారాయణరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ ఎల్‌.నరసింహారెడ్డి బుధవారం విచారణ చేపట్టారు. నివేదికను వెల్లడించే అంశంపై వివరణ ఇవ్వటానికి సమయం కావాలంటూ ఏజీ కోరటంతో తదుపరి విచారణను ఈ నెల 17కు వాయిదా వేశారు.

అంతకుముందు వాహన్‌వతి కేంద్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తూ - కమిటీ సిఫారసులు న్యాయసమీక్ష పరిధిలోకి రావన్నారు. కేంద్రం ఇంకా నిర్ణయం కూడా తీసుకోలేదని గుర్తు చేశారు. నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకునే ముందు న్యాయసమీక్ష చేయకూడదా అన్న న్యాయమూర్తి ప్రశ్నకు ఏజీ స్పందిస్తూ - చట్టప్రకారం ఏర్పడిన కమిషన్‌ గనక నిబంధనలను ఉల్లంఘిస్తే నోటీసులు ఇవ్వవచ్చని, శ్రీకృష్ణ కమిటీకి అటువంటి చట్టబద్ధ ప్రక్రియ ఏమీ లేదన్నారు. తాను చెప్పిన అభిప్రాయాన్ని కమిటీ పరిగణనలోకి తీసుకోలేదని, దానివల్ల తాను నష్టపోయానని ఎవరైనా భావిస్తే ఏం చేయాలని న్యాయమూర్తి తిరిగి ప్రశ్నించారు. అటువంటప్పుడు కమిటీకి వ్యతిరేకంగా వ్యక్తిగతస్థాయిలో పరువునష్టం దావా దాఖలు చేసుకోవచ్చని ఏజీ సూచించారు. కమిటీ ఏదైనా తప్పు చేసిందని భావిస్తే మాత్రం రాజకీయ వేదికపైనే తేల్చుకోవాలిగానీ, కోర్టులో కాదని చెప్పారు.

మావోయిస్టులు తదితర శాంతిభద్రతల సమస్యలపై కమిటీ సభ్యకార్యదర్శి అధికారులతో కూర్చుని చర్చించారని, అయితే కమిటీ నివేదికకు ఇదే ఆధారం కాదని ఏజీ స్పష్టం చేశారు. సంబంధం లేకపోయినా సమాచారం సేకరించినప్పుడు దాని ఆధారంగానే చర్య తీసుకుంటారేమోనన్న అనుమానం పిటిషనర్‌కు ఉండవచ్చు కదా అని న్యాయమూర్తి ప్రశ్నించారు. దీనికి ఏజీ జవాబిస్తూ రాష్ట్ర ప్రయోజనాల మేరకే నిర్ణయం ఉంటుందన్నారు. ప్రత్యేక తెలంగాణ, సమైక్య ఆంధ్రప్రదేశ్‌ అంశాలు ప్రస్తుతం ప్రజాభిప్రాయ దశలో ఉన్నాయని చెప్పారు. ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయదలిస్తే రాజ్యాంగం నిర్దేశించిన ప్రకారం శాసన ప్రక్రియ అమలవుతుందని, అది కోర్టుల పరిధిలోకి రాదన్నారు.కమిటీ నివేదికను రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఉందా అన్న కోర్టు ప్రశ్నకు.. తప్పనిసరిగా వెల్లడించాల్సిన అవసరం లేనప్పుడు ఆ పని చేయవచ్చని ఏజీ తెలిపారు.

శ్రీకృష్ణ నివేదికలోని 8వ అధ్యాయాన్ని కోర్టుకు సమర్పించాలని కేంద్రాన్ని ఆదేశించినట్లు పత్రికల్లో వచ్చిందని, అయితే తాను అలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఇవ్వాలనుకుంటే అది మీ ఇష్టమని చెప్పారు. అయితే, కమిటీ నివేదికలో కొంతభాగాన్ని వెల్లడించి మరికొంతభాగాన్ని రహస్యంగా ఉంచడం ఇంతకుముందు ఎప్పుడూ జరగలేదన్నారు. కమిటీ నెలల తరబడి వేలాదిమంది నుంచి అభిప్రాయాలు సేకరించిందని, ప్రతి అంశమూ బహిరంగమే అయినప్పుడు ఒక్క అధ్యాయాన్ని ఎందుకు రహస్యంగా ఉంచారని ప్రశ్నించారు. దీనికి కారణాలు తెలియజేస్తూ కౌంటరు దాఖలు చేయటానికి రెండు వారాల గడువు కావాలని వాహన్‌వతి కోరారు. ఈ సందర్భంలో పిటిషనర్‌ తరఫు న్యాయవాది గండ్ర మోహనరావు జోక్యం చేసుకుంటూ.. రహస్య అధ్యాయాన్ని వెల్లడించటం అన్నది నాలుగు కోట్ల ప్రజలకు సంబంధించిన అంశమని, సమాచార హక్కు కింద అయినా వెల్లడించాల్సిందేనని పేర్కొన్నారు. ఏ రకమైన శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందో ప్రజలకు తెలియాల్సి ఉందన్నారు.

కమిటీ సభ్య కార్యదర్శి కొందరి చేతుల్లో పావుగా మారారన్న ఆరోపణ ఉందని చెప్పారు. నివేదికను వెల్లడించే ఆలోచన ప్రభుత్వానికి ఉందా లేదా అని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఫోన్‌లో సంప్రదించి పది నిమిషాల్లో చెబుతానని ఏజీ కోరగా కోర్టు అనుమతించింది. అనంతరం కోర్టుకు వచ్చిన ఏజీ కేంద్ర అధికారులు సమావేశంలో ఉన్నారని, విచారణను ఈనెల 17కి వాయిదా వేస్తే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తెలుసుకొని చెప్పగలనన్నారు. ఈలోపే కేంద్రం నిర్ణయం తెలిపితే అదనపు సొలిసిటర్‌ జనరల్‌ రవీంద్రన్‌ వచ్చి కోర్టుకు నివేదిస్తారన్నారు. న్యాయమూర్తి విచారణను వాయిదా వేశారు.

English summary
Attorney General Vahanvathi informed to the High Court that Srikrishna Committee had not legal sanctity. He said it is not necessary to implement the committee's recommendations. Hearing on a petition filed M Narayana Reddy is adjourned for February 17.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X