కెసిఆర్ సోనియా నాయకత్వం కిందికి వస్తే తెలంగాణ: సర్వే సత్యనారాయణ

తెరాస నాయకుడు నాయని నర్సింహా రెడ్డికి, సర్వే సత్యనారాయణకు మధ్య వాగ్వివాదం చెలరేగింది. సర్వే సత్యనారాయణ ప్రసంగాన్ని తెలంగాణ ఉద్యోగులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. చరిత్ర వద్దని, పార్లమెంటులో సహాయ నిరాకరణ ఎలా చేస్తారో చెప్పాలని వారు డిమాండ్ చేశారు. దానిపై సర్వే సత్యనారాయణ కాస్తా అసహనం ప్రదర్శించారు. 20 నిమిషాల పాటు తన మాటలు వినలేకపోతే తెలంగాణ కోసం ఏం పోరాడుతారని ఆయన అడిగారు. ఆయన సమావేశం మధ్యలోనే వెళ్లిపోయారు.
తెలంగాణపై ఏకాభిప్రాయ సాధన కావాలని ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ చేసిన ప్రకటనను ఆయన ఖండించారు. తెలంగాణపై సోనియా చెప్తే తప్ప ఎవరు చెప్పినా నమ్మవద్దని ఆయన అన్నారు. తెలంగాణపై ఏకాభిప్రాయం ఎప్పుడో వచ్చిందని ఆయన అన్నారు. తాము అధికారంలో ఉన్నామని, అటువంటప్పుడు తమనే అనడం సరి కాదని ఆయన అన్నారు. సోనియానే తిడ్తారా అంటూ ఆయన చిందులు తొక్కారు. కాంగ్రెసు అధిష్టానాన్ని ఒప్పించి, మెప్పించి తెలంగాణ సాధించుకుందామని ఆయన అన్నారు. తెలంగాణపై ప్రధాని ఆ ప్రకటన ఎందుకు చేశారో అడుగుతామని ఆయన అన్నారు. తెలంగాణపై మమ్మల్ని చేతులు ఎత్తేయమంటారా అని ఆయన అడిగారు.
తెలంగాణ కోసం తమ పార్టీ పార్లమెంటు సభ్యుల కార్యాచరణ ఏమిటో ఈ నెల 21వ తేదీన చూస్తారని కాంగ్రెసు నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు మధు యాష్కీ గౌడ్ అన్నారు. తన ఎంపి పదవిని తెలంగాణ కోసమే వినియోగిస్తానని ఆయన చెప్పారు. తాము రాజీనామాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని, రాజీనామాలు చేస్తే ఉప ఎన్నికలు వస్తాయని ఆయన అన్నారు.