తెలంగాణ ఎమ్మెల్యేలకు చంద్రబాబు క్లాస్, కట్టడికి ప్రయత్నాలు

జుక్కల్ ఎమ్మెల్యే షిండేపై దాడికి నిరసనగా ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా చేద్దామని అనుకుంటున్నామని నాగం జనార్దన్ రెడ్డి చెప్పిన మాటలకు చంద్రబాబు తీవ్రంగా ప్రతిస్పందించినట్లు సమాచారం. ''మీరంతా చెప్పేది విన్నాను. ఒక నిర్ణయం తీసుకున్నాను. ఇది పార్టీ నిర్ణయం. కట్టుబడి ఉండాల్సిందే. కట్టుబడి ఉండలేనని ఎవరైనా అనుకుంటే... వెళ్లిపోయినా ఫర్వాలేదు''అని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలతో భేటీ తర్వాత పార్టీ ఎమ్మెల్యేలందరితోనూ చంద్రబాబు శాసనసభాపక్ష సమావేశాన్ని నిర్వహించారు. జయప్రకాష్ నారాయణ్, హనుమంతు షిండే, నల్గొండ జిల్లాలో పాదయాత్ర చేస్తున్న మోత్కుపల్లి నర్సింహులు, ములుగు శాసనసభ్యురాలు సీతక్కలపై తెరాస శ్రేణులు దాడులు చేయడం, వాహనాలు ధ్వంసం చేయడాన్ని శాసనసభాపక్షం ఖండించింది.
కాగా, పార్టీ తెలంగాణ ప్రాంత శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి తీరుపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. శానససభలో రేవంత్ రెడ్డి వ్యవహరించిన తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. రేవంత్ రెడ్డి స్పీకర్ వేదిక మీదికి వెళ్లి గవర్నర్ నరసింహన్ కుర్చీని వెనక్కి లాగిన దృశ్యం టీవీ చానెళ్లలో ప్రసారమైంది. దాంతో ఆయనపై చంద్రబాబు మండిపడినట్లు చెబుతున్నారు. సభలో వ్యవహరించాల్సిన తీరు ఇదేనా అని ఆయన ప్రశ్నించినట్లు తెలుస్తోంది.