రేపు స్పీకరు పోడియం ముందు బైఠాయిస్తాం: కెసిఆర్

రాష్ట్రంలో ఉద్యోగులు వారం రోజులనుండి సహాయ నిరాకరణ చేస్తున్నా, న్యాయవ్యవస్థ స్థంభించిపోయినా, విద్యార్థులు, ఉపాధ్యాయులు, సింగరేణి కార్మికులు ఆందోళన బాట పట్టినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చీమ కుట్టినట్లయినా లేదన్నారు. అంశం కేంద్రం పరిధిలో ఉన్నదని, అలా అని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి నిమ్మకు నీరెత్తినట్లు కూర్చోకూడదని, ప్రధానితో చర్చించి చర్యలు తీసుకోవాలని కోరారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక వచ్చి ఇన్ని రోజులు గడుస్తున్నా ఇంకా అలసత్వం ప్రదర్శిస్తే ఎలా అని ప్రశ్నించారు. అది ఎవరికీ శ్రేయస్కరం కాదని హెచ్చరించారు.
తెలంగాణ ప్రజలు గతంలో కేంద్రం ఇచ్చిన ప్రకటనకు కట్టుబడి ఉండమని చెబుతున్నారని, అంతకంటే ఎక్కువ ఏమీ కోరడం లేదన్నారు. 120 కోట్ల ప్రజల సాక్షిగా ఇచ్చిన ప్రకటనను కేంద్రం నీరుగార్చడం సబబు కాదన్నారు. శాసనసభ కూడా స్థంభిస్తుందని, ప్రజలు అన్నింటా సహాయ నిరాకరణ చేస్తున్నా ప్రభుత్వం స్పందించక పోవడం శోచనీయమన్నారు. తెలంగాణ జెఏసి సమావేశంలో చర్చించిన తర్వాత భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.