ఫిలిప్పీన్స్ లో అతి భారీ భూకంపం: భారత్ లోనూ ప్రకంపనలు
ఫిలిప్పీన్స్ లో అతి భారీ భూకంపం సంభవించింది. ఆ దేశ దక్షిణ ప్రాంతాన్ని వణికించింది. దీని ప్రకంపనల తీవ్రత పొరుగు దేశాల్లోనూ కనిపించింది. ఇండొనేషియాలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి ప్రకంపనలు నమోదయ్యాయి. అదే సమయంలో ఢిల్లీలో ఢిల్లీలో ప్రకంపనలు నమోదయ్యాయి. భూకంప తీవ్రత అంచనాలకు మించి ఉండటంతో సునామీ హెచ్చరికలు సైతం జారీ అయ్యాయి. ఆ తర్వాత వీటిని ఉపసంహరించుకున్నారు అధికారులు.
ఫిలిప్పీన్స్ దక్షిణ ప్రాంతంలోని మిండానావులో ఈ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 7.8గా నమోదైంది. జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ (GFZ) వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ భూకంపం భూమి ఉపరితలం నుంచి 10 కిలోమీటర్ల లోతున టెక్టానిక్ ప్లేట్లల్లో చోటు చేసుకున్న పెను కదలికల వల్ల భూమి ప్రకోపించింది. తొలుత భూకంప తీవ్రతను 7.3గా అంచనా వేశారు. ఆ తర్వాత దానిని 8.2కి పెంచారు. అనంతరం 7.8గా ఖరారు చేశారు.

భూకంపం తర్వాత యుఎస్ సునామీ వార్నింగ్ సిస్టమ్ ప్రమాదకరమైన అలలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇండోనేషియా జియోఫిజిక్స్ ఏజెన్సీ కూడా తమ దేశ ఈశాన్య తీర ప్రాంతాల కోసం సునామీ హెచ్చరికలను జారీ చేసింది. ఫిలిప్పీన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వోల్కనాలజీ అండ్ సిస్మోలజీ (PHIVOLCS) సునామీ అలలు సాధారణ ఆటుపోట్ల కంటే ఒక మీటరు ఎత్తులో వచ్చే అవకాశం ఉందని స్పష్టం చేస్తూ, తీరప్రాంత నివాసితులను వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరించింది.
రాబోయే కొన్ని గంటల్లో భూకంప అనంతర ప్రకంపనలు (ఆఫ్టర్ షాక్స్) వచ్చే అవకాశముందని PHIVOLCS హెచ్చరించింది. ప్రాంతీయ అత్యవసర బృందాలు సముద్ర మట్టాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి. ఈ విపత్కర పరిస్థితుల్లో, తీరప్రాంతాల్లోని ప్రజలు అధికారుల సూచనలను పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. తీర ప్రాంత వాసులను వెంటనే ఎత్తైన ప్రాంతాలకు తరలి వెళ్లాలని ఆదేశించారు.
ఫిలిప్పీన్స్ లో తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్‌లో ఉంటుందీ దేశం. కెనడా, అమెరికా, మెక్సికో, గ్వాటెమాలా, కోస్టారికా, చిలీ, పెరు, ఈక్వెడార్, కొలంబియా, రష్యా, జపాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇండొనేసియా, పపువా న్యూగినియా, న్యూజిలాండ్.. రింగ్ ఆఫ్ ఫైర్ దేశాలు.












Click it and Unblock the Notifications