తెలంగాణపై బాబుకు కిరణ్ చురక: దోబూచులాట వద్దని వినతి

తెలంగాణపై రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చేయలేదని ముఖ్యమంత్రి ఎన్. కిరణ్ కుమార్ రెడ్డి మంగళవారం మధ్యాహ్నం శాసనసభలో తేల్చేశారు. ప్రతిపక్షాలు పాల్గొనకుండానే గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఆయన మంగళవారం శాసనసభలో సమాధానమిచ్చారు. తెలంగాణ సమస్యను పరిష్కరించాల్సింది కేంద్ర ప్రభుత్వమేనని, తెలంగాణపై కేంద్రం తీసుకునే నిర్ణయానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం నడుచుకుంటుందని ఆయన చెప్పారు. ప్రతిపక్షాల తెలంగాణ నినాదాలు దద్ధరిల్లుతున్న సమయంలోనే ఆయన తన ప్రసంగాన్ని సాగించి ముగించారు. తెలంగాణ సమస్య 50 ఏళ్లుగా ఉందని, ఈ సమస్యను సహనంతో పరిష్కరించుకోవాల్సి ఉంటుందని, ఈ విషయంలో సభ్యులు ఒపికతో వ్యవహరించాలని ఆయన అన్నారు.
ప్రజలకు ఇబ్బంది కలగకుండా అందరం కలిసి పనిచేయాల్సి ఉంటుందని ఆయన అన్నారు. తమ ప్రభుత్వం రైతు సంక్షేమానికి, ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉందని ఆయన అన్నారు. శాసనసభలో గవర్నర్ నరసింహన్‌పై దాడి చేసే ప్రయత్నం చేశారని ఆయన అన్నారు. అటువంటి ప్రయత్నం చేయడం సిగ్గుచేటు అని ఆయన అన్నారు. శాసనసభ్యుడిపై దాడి జరిగితే కూడా ఖండించలేని స్థితిలో ప్రతిపక్షం ఉందని, ఇదే స్థితిలో ఉంటే మళ్లీ ప్రతిపక్షంలోనే కూర్చోవాల్సి ఉంటుందని ఆయన అన్నారు.
ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని, దాన్ని హరించే ప్రయత్నం ఎవరు చేసినా సహించకూడదని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కించపరిచే విధంగా శాసనసభ్యులే వ్యవహరిస్తే నవ్వులపాలు అవుతామని ఆయన అన్నారు. శాసనసభ సజావుగా నడిచేందుకు సహకరించాలని ఆయన సభ్యులను కోరారు. ముఖ్యమంత్రి ప్రసంగం ముగిసిన వెంటనే డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ సభను సాయంత్రం ఐదు గంటలకు వాయిదా వేశారు.