హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లగడపాటి, రాయపాటి ఉన్మాదులు, హైదరాబాద్‌పై బెట్టు వీడండి: కెటిఆర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

KT Rama Rao
హైదరాబాద్: విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ ఉన్మాదిలా వ్యవహరిస్తున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి, సిరిసిల్ల ఎమ్మెల్యే కె తారకరామారావు గురువారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆరోపించారు. టిఆర్ఎస్ అధ్యక్షుడు కెసిఆర్, విజయశాంతి తెలంగాణ అంశంపై పట్టుబట్టడంతో పార్లమెంటు వాయిదా పడిందని, టిఆర్ఎస్‌కు బుధవారం భారతీయ జనతా పార్టీతో పాటు ఎన్డీయే పక్షాలు మద్దతుగా గొంతు విప్పాయని చెప్పారు. రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ వీరప్ప మొయిలీ మాటలు చూస్తుంటే ఆయనకు చట్టంపై అవగాహన లేనట్లుగా కనిపిస్తుందన్నారు. ఆయనకు రాజ్యాంగ మీద అవగాహన ఏమాత్రం లేనట్లుగా ఉందన్నారు. ఇంతకుముందు 14 రాష్ట్రాలు ఏర్పడినప్పుడు ఎలాంటి పద్దతి చేపట్టారో అలాంటి పద్ధతి చేపట్టాలన్నారు. అసెంబ్లీలో కేవలం పార్టీల నిర్ణయాలు మాత్రమే అడుగుతారని చెప్పారు.

అసెంబ్లీలో అన్ని పార్టీలు ఒప్పుకోకున్నప్పటికీ కేంద్రం రాష్ట్రం ఇవ్వాలనుకుంటే ఇవ్వవచ్చన్నారు. ఇంతకుముందు మొయిలీ డబ్బు సంచులు తీసుకొని సీమాంధ్రులకు అనుకూలంగా మాట్లాడిన విషయం అందరికీ తెలుసున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంఛార్జ్‌లా కాకుండా, సీమాంద్ర వ్యవహారాల ఇంఛార్జ్‌గా వ్యవహరిస్తున్నారన్నారు. మొయిలీ న్యాయశాఖ మంత్రికి తగరని, ఆయనను వెంటనే ప్రధాని మన్మోహన్ బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. బుధవారం సీమాంధ్రకు చెందిన లగడపాటి రాజగోపాల్, రాయపాటి సాంబశివరావు వంటి వారి ప్రోద్భలంతోనే మొయిలీ అలా మాట్లాడుతున్నారన్నారు. నాడు పొట్టి శ్రీరాములు మద్రాసు నుండి ఆంధ్ర రాష్ట్రం ఎలాంటి కారణాలతో నిరాహార దీక్షకు కూర్చున్నారో నేడు తెలంగాణ ప్రజలు అదే డిమాండ్లతో రాష్ట్రాన్ని అడుగుతున్నారన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయాలనే ఉద్దేశ్యం కూడా ఉన్మాద లగడపాటి వంటి వారికి లేకపోవడం శోచనీయమన్నారు.

సామాన్య సీమాంధ్రులు కూడా తెలంగాణకు మద్దతు ఇస్తుండగా, సీమాంధ్ర పెట్టుబడిదారులు మాత్రమే తెలంగాణను వ్యతిరేకిస్తున్నారన్నారు. తమకు దక్కని హైదరాబాద్‌ మరెవరికీ దక్కకూడదన్న ఉన్నాదంతోనే లగడపాటి ఉన్నారన్నారు. లగడపాటి ఉన్నాదం చూస్తుంటే వరలక్ష్మి హత్య కేసు గుర్తుకు వస్తుందన్నారు. హైదరాబాద్ మీద అంత ప్రేమ ఉన్న లగడపాటి తన లాంకో ప్రధాన కార్యాలయాన్ని గూర్గావ్‌కు ఎందుకు తరలించారని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీ కూడా దేశంలోని ఏ ప్రత్యేక రాష్ట్ర వాదనలను మేం పరిగణలోకి తీసుకోవడం లేదని, కేవలం తెలంగాణను మాత్రమే తీసుకుంటున్నామని చెప్పారన్నారు. సీమాంధ్రకు చెందిన ఎంపీలు హైదరాబాద్ విషయంలో మూర్ఖంగా ప్రవర్తించకూడదన్నారు. కొందరు సీమాంధ్ర టిడిపి, కాంగ్రెసు ఎంపీలు కూడా తెలంగాణకు ఓకే అంటున్నట్టు ప్రయివేటు సంభాషణలలో తెలుస్తుందన్నారు. గత డిసెంబర్ 9న తెలంగాణ ప్రక్రియ ప్రారంభిస్తున్నట్టు కేంద్రం ప్రకటించిందన్నారు.

అయితే అది రాష్ట్రంలో అన్ని పార్టీలు తీర్మానం పెడితే మద్దతు ఇస్తామని అన్ని పార్టీలు చెప్పాకనే కేంద్రం ప్రకటించిందన్నారు. గతంలో తెలంగాణ తీర్మానానికి మద్దతు ఇస్తామని చంద్రబాబు చెప్పారన్నారు. తెలుగుదేశం పార్టీ నేతలు ఆత్మప్రభోదానుసారం తీర్మానంలో ఓటు వేస్తామని అంటున్నారని, అయితే అది నయవంచన అవుతుందన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశ పెట్టి కేంద్రానికి పంపితే కేంద్రానికి తెలంగాణ మరింత సానుకూలం అయ్యే విధంగా ఉంటుందన్నారు. అందుకే కేంద్రంలో పరిష్కారమయ్యే తెలంగాణ సమస్యకు అసెంబ్లీలో తీర్మానం పెట్టమని అడుగుతున్నామన్నారు. అసెంబ్లీలో తీర్మానం పెడతామని గతంలో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చిందన్నారు. మీరు ఇచ్చిన హామీనే నెరవేర్చాలని మేం డిమాండ్ చేస్తున్నామన్నారు.

తెలంగాణపై అసెంబ్లీలో తీర్మానం పెట్టే వరకు సభను అడ్డుకుంటామన్నారు. తెలంగాణకు అనుకూలంగా 4 లక్షల మంది ఉద్యోగులు సహాయ నిరాకరణ చేస్తున్నారన్నారు. సిపాయిల తిరుగుబాటు తర్వాత ఎలా అయితే స్వాతంత్రం విషయంలో ఓ కుదుపు వచ్చిందో అలాగే తెలంగాణ ప్రజలతో పాటు తెలంగాణలోని పోలీసులు కూడా సహాయ నిరాకరణ చేస్తే ప్రభుత్వంలో స్పందన ఉంటుందన్నారు. కొందరు పోలీసులు ఇప్పటికే సహాయ నిరాకరణకు మద్దతు ఇస్తున్నారని వారికి కృతజ్ఞతలు చెప్పారు.

English summary
TRS MLA KT Ramarao blamed today central minister Veerappa Moily in media conference, held at Telangana Bhavan. He demanded CM Kiran Kumar government to propose Telangana resolution in assembly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X