దమ్ముంటే రాజీనామాలు చేయండి: సీమాంధ్రులకు కెటిఆర్ సవాల్

తెలంగాణ పార్టీ త్యాగాలకు నెలవు అన్నారు. వందల మంది విద్యార్థులు తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించారన్నారు. తెలంగాణకు చెందిన ప్రజాప్రతినిధులకు తెగింపు, ధైర్యం లేకపోవచ్చు. అలా అని ప్రజలను అవమానపర్చడం ఏలూరు పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివరావు వంటి వారికి సరికాదన్నారు. తెలంగాణకు అనుకూలంగా త్రిపురనేని హనుమాన్ చౌదరి వంటి పలువురు ఆంధ్రా నేతలు అక్కడి ప్రజలను జాగృత పరుస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రం ఇప్పటికే ఉద్రిక్తంగా మారిందన్నారు. రావణకాష్టంలా కాక ముందే తెలంగాణపై నిర్ణయం తీసుకోవాలని సూచించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను సీమాంధ్ర ప్రజాప్రతినిధులు అర్థం చేసుకోవాలని కోరారు. తెలంగాణపై ఉన్మాదిలా ప్రవర్తించవద్దని కోరారు.
ఇన్నాళ్లు తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నా మజ్లిస్ పార్టీ కూడా హైదరాబాద్ తెలంగాణలో అంతర్భాగమని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. సీమాంధ్రులు మాకు దక్కనిది ఇతరులకు దక్కకూడదన్న తీరుగా వ్యవహరిస్తున్నారన్నారు. సీమాంధ్రలో ఉద్యమం ఎక్కడుందో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు కాంగ్రెసు పార్టీ ముందుకు వచ్చినా రాకున్నా ప్రజలంతా ముందుకు వస్తున్నారన్నారు. తెలంగాణ ఇచ్చేది, తెచ్చేది మేమే అని కాంగ్రెసు అంటోందని, కానీ తెలంగాణను ముంచింది, నష్టపరిచింది కాంగ్రెసు అన్నారు. అప్పుడు ఇష్టం లేకుండా తెలంగాణ, సీమాంధ్రలను కలిపింది, ఇప్పుడు తెలంగాణకు అడ్డు కాంగ్రెసు పార్టీయే అన్నారు.
రాష్ట్రంలోని అన్ని పార్టీలలో ఏకాభిప్రాయం ఉందన్నారు. కేవలం తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలలోనే ఏకాభిప్రాయం లేదన్నారు. వారి అసమర్థతను కప్పి పుచ్చుకోవడానికి అఖిలపక్షం అంటూ కుంటి సాకులు చెబుతున్నారన్నారు. ఎవరికి తెగింపు ఉన్నా లేకున్నా, ఎవరు రాజీనామాలు చేసినా చేయకున్నా మనమే తెగిద్దామని చెప్పారు. గతంలో తెలంగాణ కోసం కెసిఆర్ నిరాహార దీక్ష చేసినప్పుడు తెలంగాణ ప్రజలు, విద్యార్థులు సమైక్యంగా మద్దతు పలికారన్నారు. ఆ మద్దతు కారణంగానే కేంద్రం తెలంగాణకు అనుకూలంగా ప్రకటన చేసిందన్నారు. నాటి కేంద్రం ప్రకటన మరోసారి చేయించుకుందామని చెప్పారు. ఈ నెల 10న మిలియన్ మార్చ్‌ని అందరూ విజయవంతం చేయాలని కోరారు.