ఇండియాలో టాప్-5 హైస్పీడ్ రైళ్లు
మనదేశంలో టాప్-5 హైస్పీడ్ రైళ్లల్లో మొదటి స్థానాన్ని న్యూ ఢిల్లీ నుంచి భోపాల్ మధ్య నడిచే వందేభారత్ ఎక్స్ ప్రెస్ దక్కించుకుంది. ఈ రైలు గరిష్ట వేగం గంటకు 180 కిలోమీటర్లు ఉండగా, ఈ రెండు నగరాల మధ్య గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఈ వందేభారత్ సున్నా నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 52 సెకన్లలోనే అందుకుంటుంది. 701 కిలోమీటర్ల దూరాన్ని ఏడున్నర గంటల్లోనే అధిగమిస్తుంది.
'గతిమాన్'కు 2వ స్థానం
అత్యంత వేగంగా ప్రయాణించే రైళ్లల్లో దేశంలో రెండో స్థానాన్ని గతిమాన్ ఎక్స్‌ప్రెస్ దక్కించుకుంది. 2019లో వందేభారత్ అడుగుపెట్టక ముందు ఈ రైలుకు విపరీతమైన క్రేజ్ ఉండేది. 2016 ఏప్రిల్ 5వ తేదీన ప్రారంభమైన ఈ రైలే మనదేశపు మొదటి సెమీ హైస్పీడ్ రైలుగా పేరు తెచ్చుకుంది. హజ్రత్ నిజాముద్దీన్ నుంచి వీరాంగణ లక్ష్మీబాయి జాన్సీ జంక్షన్ వరకు నడుస్తుంది. 403 కిలోమీటర్ల దూరాన్ని నాలుగున్నర గంటల సమయంలోనే చేరుకుంటుంది. ఇది కూడా దాదాపు గంటకు 160 కిలోమీటర్ల వేగంతోనే ప్రయాణిస్తుంది. గతిమాన్ ఎక్స్ ప్రెస్ సగటు వేగం 91 కిలోమీటర్లు. ఢిల్లీ నుంచి ఆగ్రాకు కేవలం 1.40 గంటల్లో ప్రయాణాన్ని పూర్తి చేస్తుంది.

శతాబ్దికి 3వ స్థానం
న్యూఢిల్లీ నుంచి భోపాల్ వరకు నడిచే శతాబ్ది ఎక్స్ ప్రెస్ మూడోస్థానంలో నిలుస్తుంది. ఇది గంటకు 140 నుంచి 155 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. టూరిస్టులు, వ్యాపారవేత్తలకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. భారతదేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని 1988 జులై 10వ తేదీన ఈ శతాబ్ది ఎక్స్ ప్రెస్ ను ప్రారంభించారు. గతిమాన్ రాకముందు ఇదే అత్యంత హైస్పీడ్ రైలుగా నిలిచింది.
తేజస్ రాజధానికి 4వ స్థానం
ముంబయి నుంచి న్యూఢిల్లీ వరకు నడిచే తేజస్ రాజధాని ఎక్స్‌ప్రెస్ నాలుగో స్థానంలో నిలుస్తుంది. ఈ రైలు వేగం గంటకు 160 కిలోమీటర్లు అయినప్పటికీ ప్రస్తుతం 130 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. సగటు వేగం గంటకు 90 కిలోమీటర్లు. సిగ్నల్ క్లియరెన్స్ ఇవ్వడంలో తేజస్ రాజధాని ఎక్స్ ప్రెస్ కే ఈ మార్గంలో ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు.
తేజస్ ఎక్స్ ప్రెస్ కు 5వ స్థానం
ముంబయి నుంచి గోవా వరకు ప్రయాణించే తేజస్ ఎక్స్ ప్రెస్ 5వ స్థానంలో నిలుస్తుంది. భారతదేశపు మొట్టమొదటి సెమీ-హైస్పీడ్ పూర్తి ఏసీ లగ్జరీ రైలుగా దీనికి పేరుంది. ఈ మార్గంలో తేజస్ గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఎల్‌ఈడీ స్క్రీన్స్, సెలబ్రిటీ తరహా కేటరింగ్, ఆటోమేటిక్ డోర్స్, టచ్-లెస్ వాటర్‌ట్యాప్స్ వంటి విలాసవంతమైన సదుపాయాలు ఉన్నాయి. దీంతోపాటు పలు మార్గాల్లో నడుస్తున్న తేజస్ ఎక్స్ ప్రెస్ రైళ్లు దేశంలోనే తొలి ప్రయివేట్ రైళ్లుగా నిలిచాయి.
ముంబయి నుంచి అహ్మదాబాద్ మధ్య మన దేశ తొలి బుల్లెట్ రైలు పనులు శరవేగంగా సాగుతున్నాయి. వచ్చే ఏడాది ఇది అందుబాటులోకి రాబోతోంది. గంటకు 320 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించనున్న ఈ రైలు ప్రారంభమైన తర్వాత భారత దేశంలోనే అత్యంత వేగవంతమైన రైలుగా సరికొత్త రికార్డు సృష్టించబోతోంది.












Click it and Unblock the Notifications