ఆహార కల్తీపై ఉక్కుపాదం.. హైడ్రా తరహాలో స్పెషల్ ఫోర్స్!
మార్కెట్‌లో నిత్యావసర వస్తువుల కల్తీ ఇప్పుడు అతిపెద్ద సమస్యగా మారింది. ఈ క్రమంలో నిత్యావసర వస్తువుల కల్తీని అరికట్టేందుకు తెలంగాణప్రభుత్వం కీలకనిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు హైడ్రా, ఈగల్ ఫోర్స్‌ల మాదిరిగా ఒక బలమైన స్పెషల్ టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసే సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ కొత్త యూనిట్ నిత్యావసరాలైన పాలు, నూనెలు, మసాలాలు, ఆహారపదార్థాలు తదితర వస్తువుల్లో జరుగుతున్న కల్తీ దందాపై చర్యలు తీసుకుంటుంది.
ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న కేటుగాళ్ల దందా
ప్రస్తుతం మార్కెట్‌లో దాదాపు అన్ని వస్తువుల్లోనూ కల్తీ సాగుతోంది. తినే ఆహారం నుంచి తాగేనీటి వరకు ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న కేటుగాళ్లు భారీగా దందా చేస్తున్నారు. ఇప్పటికే ఫుడ్ సేఫ్టీ అధికారులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేసి కేసులు నమోదుచేస్తున్నా ఆహారకల్తీ తీవ్రంగా ఉండటంతో కల్తీ కట్టడి కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సీరియస్ అయి, ప్రత్యేక ఫోర్స్ ద్వారా సమస్యకు శాశ్వత పరిష్కారం చూడాలని నిర్ణయించింది.

లైసెన్సులు రద్దు చేసే అధికారం
సీనియర్ ఐపీఎస్ అధికారి నేతృత్వంలో రెవెన్యూ, మున్సిపల్, హెల్త్, పోలీస్ శాఖల అధికారులను కలిపి ఈ ఫోర్స్‌ను ఏర్పాటు చేయనున్నారు.ఈ స్పెషల్ ఫోర్స్‌కు సెర్చ్, సీజ్ ఆపరేషన్లు నిర్వహించే, భారీగా జరిమానాలు విధించే, లైసెన్సులు రద్దు చేసే వంటి విస్తృత అధికారాలు కట్టబెట్టనున్నారు.
సీజ్ చేయటం, నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయటం వంటి చర్యలు
కల్తీ ఉత్పత్తుల తయారీ కేంద్రాలపై దాడులు చేసి, సంబంధిత హోటళ్లు, గోడౌన్లను సీజ్ చేయడం, నిందితులపై నాన్-బెయిలబుల్ కేసులు నమోదు చేయడం వంటి చర్యలు తీసుకునే అధికారాలు కల్పించాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ప్రస్తుత ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్‌లో ఉన్న సిబ్బంది కొరత, అధికారాల లోపాలను దృష్టిలో ఉంచుకొని ఈ కొత్త ఫోర్స్ రూపొందించబడుతోంది.
కల్తీ ముఠాలపై చర్యలు
సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఇప్పటికే సమగ్ర ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. నిధుల కేటాయింపు, చట్టపరమైన అధికారాలు, సమన్వయ వ్యవస్థలపై సుదీర్ఘచర్చలు జరిపి రిపోర్ట్ తయారు చేశారు. త్వరలోనే కేబినెట్ ఆమోదం పొంది అమలులోకి తీసుకురానున్నారు. ఈ ఫోర్స్ పాలు, నూనె, మసాలా, హోటల్ ఆహారాలు వంటి ప్రతి వస్తువుపై నిరంతర నిఘా పెట్టి, కల్తీ ముఠాలను ఎదుర్కొంటుంది. ఈ చర్యలు ప్రజల ఆరోగ్య రక్షణలో ముఖ్యమైన మలుపుగా చూడవచ్చు.
స్పెషల్ ఫోర్స్ ఏర్పాటుతో తెలంగాణలో ఆహార భద్రతా వాతావరణం
కల్తీ వెనుక ఎవరు ఉన్నా వారిని వదలకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. ఈ స్పెషల్ ఫోర్స్ ఏర్పాటు ద్వారా తెలంగాణలో ఆహార భద్రతా వాతావరణం మెరుగుపడే అవకాశం ఉంది. ప్రజలు కూడా కల్తీ ఉత్పత్తులను గుర్తించి అధికారులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ నిర్ణయం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజా సమస్యల పట్ల చూపుతున్న సీరియస్‌నెస్‌ను తెలియజేస్తోంది.












Click it and Unblock the Notifications