చంద్రబాబు నన్ను ఏకాకిని చేయలేరు: ఎమ్మెల్యే నాగం జనార్దన్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) సభ్యులు, కాంగ్రెసు తెలంగాణ ప్రాంత సభ్యులు, బిజెపి, సిపిఐ సభ్యులు సభలో లేరని, తెలంగాణ కోసం అడుగుతున్న సభ్యులెవరూ లేకుండా తెలుగుదేశం తెలంగాణ ప్రాంత సభ్యులు సభను సజావుగా సాగనిస్తే తెలంగాణ ప్రజలు తప్పు పట్టరా అని ఆయన అడిగారు. తెలంగాణకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం గానీ, తమ పార్టీ అధిష్టానం గానీ నిర్ణయం తీసుకుంటే తాను సొంత నిర్ణయం తీసుకుంటానని, అప్పటి వరకు తాను తెలుగుదేశం పార్టీలో ఉంటానని, పార్టీలో ఉండే పోరాటం చేస్తానని ఆయన చెప్పారు. తాను తమ పార్టీ తెలంగాణ ప్రాంత శాసనసభ్యులకు వ్యతిరేకం కాదని, మిగతా శాసనసభ్యులు కూడా తనతో కలిసి వస్తారని అనుకుంటానని ఆయన అన్నారు. ప్రజల అభిప్రాయాలకు భిన్నంగా వ్యవహరిస్తే ఏ పార్టీ కూడా మనుగడ సాగించలేరని ఆయన అన్నారు.
తనపై మోత్కుపల్లి నర్సింహులు చేసిన విమర్శలను ఆయన ఖండించారు. తాను ఎవరినీ బ్లాక్ మొయిల్ చేయడం లేదని ఆయన అన్నారు. తాను ఎవరినీ మోసం చేయడం లేదని ఆయన అన్నారు. తెలంగాణ కోసం మాత్రమే పోరాటం చేస్తున్నానని ఆయన అన్నారు. తన వ్యక్తిత్వమేమిటో ప్రజలందరికీ తెలుసునని ఆయన అన్నారు. తెలంగాణ కోసం పోరాటం చేస్తామని చెప్పి ఎన్నికల్లో పోటీ చేసి గెలిచామని, ప్రజలకు ఇచ్చిన హామీకి కట్టుబడి పని చేయాల్సిన అవసరం లేదా అని ఆయన అన్నారు. తాను మిగతా శాసనసభ్యులతో విభేదించడం లేదని, పార్టీ నిర్ణయానికి కట్టుబడే మాట్లాడుతున్నానని ఆయన చెప్పారు. తెలంగాణపై కాంగ్రెసు నాటకాలు మానేయాలని, తాను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన అన్నారు. ఓబుళాపురం గనుల వ్యవహారంపై కూడా తాను ఒంటరి పోరాటమే చేశానని, తన పోరాటం సరైందనేది సుప్రీంకోర్టు తీర్పు రుజువు చేసిందని, ఇప్పుడు కూడా తన పోరాటం సరైందనే విషయాన్ని ప్రజలు నిరూపిస్తారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications