హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అసంతృప్త నిజామాబాద్ జిల్లా బాన్సువాడ శాసనసభ్యుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరనున్నట్టుగా సమాచారం. గత కొన్నేళ్లుగా టిడిపికి దూరంగా ఉంటున్న పోచారం రాజీనామా ముహూర్తం ఖరారైంది. 23న పోచారం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి అనంతరం అదే రోజు టిఆర్ఎస్ అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు సమక్షంలో పార్టీలో చేరనున్నారు. అదేరోజు తన నియోజకవర్గం బాన్సువాడలో బహిరంగ సభను ఏర్పాటు చేసి టిఆర్ఎస్‌లోకి చేరనున్నట్లుగా తెలుస్తోంది. కాగా ఈనెల 29తో శాసనసభా సమావేశాలు ముగుస్తుండటంతో అంతకు వారం రోజులు ముందుగా పోచారంతో రాజీనామా చేయించి టెంపో క్రియేట్ చేయాలన్న ఉద్దేశ్యంతో కెసిఆర్ ఇలా రాజీనామా చేయిస్తున్నట్టుగా తెలుస్తోంది.
గత కొద్దికాలంగా తెలంగాణలోని ఉద్యమం దృష్ట్యా ఆయన టిడిపి పట్ల తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. తెలంగాణ విషయంలో టిడిపి అధినేత చంద్రబాబునాయుడి వైఖరిని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. చంద్రబాబు తెలంగాణకు అనుకూలంగా ఉండాలని డిమాండ్ చేయటంతో పాటు, తెలంగాణ టిడిపి ఎమ్మెల్యేలు ఆ పార్టీ వీడి రావాలని డిమాండ్ చేశారు. అయితే పోచారం రాజీనామా విషయం బయటకు రావడంతో టిడిపి బుజ్జగింపు యత్నాలు ఏమైనా చేస్తుందా అనేది చూడాలి.