నిజామాబాద్: తెలుగుదేశం పార్టీ అసంతృప్త అభ్యర్థి పోచారం శ్రీనివాస్ రెడ్డి బుధవారం టిడిపికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి ఆయన పంపించారు. కేవలం పార్టీకి మాత్రమే కాకుండా ఆయన శాసనసభ్యత్వానికి కూడా రాజీనామా చేసే అవకాశాలు ఉన్నాయి. టిడిపికి రాజీనామా చేసిన పోచారం ఈ రోజు సాయంత్రం తన సొంత నియోజకవర్గం అయిన బాన్సువాడలో భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. అక్కడే ఆయన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరనున్నారు. ఈయన టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు సమక్షంలో ఆ పార్టీలో చేరనున్నారు.
కాగా బహిరంగ సభ ఏర్పాట్లు పరిశీలించడానికి టిఆర్ఎస్ పార్టీకి చెందిన సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు ఇప్పటికే బాన్సువాడ చేరుకున్నారు. ఈయన చేరికకు చాలామంది టిఅర్ఎస్ ప్రతినిధులు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. బాన్సువాడ నియోజకవర్గానికే కాకుండా నిజామాబాద్ జిల్లాలోనే పోచారం శ్రీనివాస్ రెడ్డికి గట్టి పట్టు ఉంది. పోచారం రాజీనామాతో జిల్లాలో టిడిపి గట్టు పట్టు కోల్పోయినట్లేనని భావించవచ్చు. తెలంగాణపై చంద్రబాబు వైఖరికి నిరసిస్తూ రెండు నెలల క్రితమే పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని పోచారం ప్రకటించిన విషయం తెలిసిందే.