భూ కేటాయింపుల వివాదం: వైయస్ జగన్ వర్సెస్ చంద్రబాబు

వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో జరిగిన భూ కేటాయింపులపై కాంగ్రెసుకు చెందిన నాయకులు కూడా విమర్శలు చేస్తున్నారు. ప్రత్యేక ఆర్థిక మండళ్లకు (సెజ్‌లకు) కేటాయించిన భూములపై సమీక్ష చేసి అవసరమైతే భూములను వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దీనికి అనుగుణంగానే కిరణ్ కుమార్ రెడ్డి వాటి సమీక్షకు పూనుకుంది. వైయస్ రాజశేఖర్ రెడ్డి పేరును వైయస్ జగన్ తన రాజకీయాలకు వాడుకుంటుండడంతో ప్రభుత్వం ఆ చర్చకు దిగిందని అంటున్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రతిష్టను దెబ్బ తీసే ఎత్తుగడల్లో భాగంగానే ప్రభుత్వం ఈ చర్యకు దిగిందని, ఇందుకు గాను ప్రభుత్వం తెలుగుదేశం పార్టీతో కుమ్మక్కయ్యారని జగన్ వర్గం విమర్శిస్తోంది.
వైయస్ రాజశేఖర రెడ్డి ప్రతిష్టను దెబ్బ తీసేందుకు చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి ప్రయత్నిస్తారనే సాకుతో తమ అక్రమాలు బయటపడకుండా జగన్ వర్గం ఆందోళనకు దిగిందని చెబుతున్నారు. వైయస్సార్ రాజశేఖర రెడ్డి ప్రతిష్టను దెబ్బ తీయడం ద్వారా జగన్ రాజకీయాలను కట్టడి చేయడమే అందులోని ఆంతర్యమని చెబుతున్నారు. నిజానికి, భూముల కేటాయింపుల వ్యవహారం చంద్రబాబు హయాంలోనే ప్రారంభమైనా, ఇష్టానుసారంగా వైయస్ రాజశేఖర రెడ్డి దాన్ని విస్తరించారని, తద్వారా తన కుటుంబ సభ్యులకు, అనుచరులకు లబ్ధి చేకూర్చారని విమర్శలు వినిపిస్తున్నాయి.