వైయస్సార్ భూ కేటాయింపులపై వైయస్ జగన్ కౌంటర్

భూ కేటాయింపులపై శాసనసభలో చర్చ వచ్చే సందర్భంలో దాన్ని అడ్డుకునేందుకు వైయస్ జగన్ వర్గం శాసనసభ్యులు సమాయత్తమవుతున్నారు. వైయస్ హయాంలో అక్రమాలు జరిగాయనే విషయం ప్రస్తావనకు వస్తే గందరగోళం సృష్టించడానికి సిద్ధపడుతున్నారు. ప్లకార్డులు ప్రదర్శించాలని, సభా కార్యక్రమాలను అడ్డుకోవాలని వారు యోచిస్తున్నారు. ఎమ్మార్ ప్రాపర్టీస్, రహేజా వంటి పలు అంశాలు చర్చకు వస్తే, ప్రధానంగా వైయస్‌పై ఆరోపణలు వస్తాయని వైయస్ జగన్ భావిస్తున్నారు. దీంతో దాన్ని అడ్డుకోవడం అవసరమని భావించి తన వర్గం ఎమ్మెల్యేలను సమాయత్తం చేశారు.
భూకేటాయంపులపై చర్చ జరిగిన తర్వాత అవసరమనిపిస్తే సభా సంఘం వేస్తామని ప్రభుత్వం ప్రతిపక్షాలకు చెబుతోంది. వైయస్ హయాంలో జరిగిన భూకేటాయింపులపై సభా సంఘం వేయాలని తెలుగుదేశం పార్టీ సభ్యులు కొద్ది రోజులుగా సభా కార్యక్రమాలను అడ్డుకుంటున్నారు. అయితే, జగన్‌కు అనుకూలించే పరిణామం కూడా చోటు చేసుకుంటోంది. భూ కేటాయింపులపై వేసే సభా సంఘం పరిధిలోకి వక్ఫ్ భూముల ఆక్రమణను కూడా చేర్చాలని మజ్లీస్ పట్టుబడుతోంది. ఈ అంశాన్ని కూడా చేరిస్తే కాంగ్రెసు నాయకుల బండారం కూడా బయటపడుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉందని, అందువల్ల మొత్తం భూకేటాయింపులపై సభా సంఘం వేసే విషయంలోనే వెనక్కి తగ్గే అవకాశం ఉందని అంటున్నారు.












Click it and Unblock the Notifications