తెరపై హీరో కనపడినప్పుడు అభిమానులు విసిరిన చిల్లరే కోటి రూపాయలైంది
తెలుగు సినిమా చరిత్రను 'అడవి రాముడు'కి ముందు, 'అడవి రాముడు'కి తర్వాత అని విభజించవచ్చు. ఈరోజుల్లో మనం వెయ్యి కోట్లు, రెండు వేల కోట్ల వసూళ్ల గురించి మాట్లాడుకుంటున్నాం కానీ, 49 ఏళ్ల క్రితం ఒక ప్రాంతీయ సినిమా సృష్టించిన ప్రభంజనం నేటి పాన్ ఇండియా సినిమాలకు కూడా సాధ్యం కాదని సినీ విశ్లేషకులు తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. నందమూరి తారక రామారావు కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచిన చిత్రం 'అడవి రాముడు'.
10 బాహుబలి సినిమాలతో సమానం..
1977లో దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు, నటరత్న ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రం తెలుగు సినిమా కమర్షియల్ ఫార్మాట్‌ను పూర్తిగా మార్చేసింది. అడవిలో అక్రమ కలప స్మగ్లింగ్‌ను ఎదిరించే ఒక ఫారెస్ట్ ఆఫీసర్ కథగా వచ్చిన ఈ మూవీ, ఆ రోజుల్లోనే ఒక విజువల్ వండర్. ఇటీవల ఈ సినిమా 49 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రాఘవేంద్రరావు భావోద్వేగానికి లోనవుతూ.. "ఈ సినిమా సృష్టించిన ఇంపాక్ట్ ఇప్పటి 10 బాహుబలి సినిమాలతో సమానం" అని పేర్కొనడం ఈ సినిమా రేంజ్‌ను తెలియజేస్తుంది.

చిల్లరే కోటిరూపాయలైంది..
ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సృష్టించిన వింతలు అన్నీ ఇన్నీ కావు. థియేటర్లలో ఎన్టీఆర్ స్క్రీన్‌పై కనిపిస్తే అభిమానులు పూలు, కాగితాలు చల్లడం మనకు తెలుసు. కానీ, 'అడవి రాముడు' ఆడే థియేటర్లలో అభిమానులు విసిరేసిన చిల్లర నాణేలను ఏరితే.. వాటి విలువ అప్పట్లోనే దాదాపు కోటి రూపాయలుగా తేలింది. అంటే ఈ సినిమా థియేటర్ల దగ్గర ఎంతటి రద్దీ ఉండేదో ఊహించుకోవచ్చు. అప్పట్లో 100 రోజులు ఆడటమే గగనం అనుకుంటే.. ఈ చిత్రం 32 కేంద్రాలలో 100 రోజులు, 16 కేంద్రాలలో 175 రోజులు ఆడింది. ఇక మూడు కేంద్రాలలో ఏకంగా 366 రోజులు ప్రదర్శితమై చరిత్ర సృష్టించింది. ఒక ప్రాంతీయ భాషా చిత్రం ఒకే రాష్ట్రంలో ఇంతటి సుదీర్ఘ కాలం ఆడటం ఇప్పటికీ ఒక సంచలన రికార్డే.
ఎవర్‌గ్రీన్ మ్యూజికల్ హిట్..
ఈ సినిమా సక్సెస్‌లో సంగీత దర్శకుడు కె.వి. మహదేవన్, రచయిత వేటూరి సుందరరామమూర్తిల పాత్ర మరువలేనిది. ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల గానం చేసిన పాటలు నేటికీ మారుమోగుతూనే ఉంటాయి. జయప్రద, జయసుధల గ్లామర్, ఎన్టీఆర్ మాస్ మేనరిజమ్స్ తోడై ఈ సినిమాను సూపర్ డూపర్ హిట్ చేశాయి. దశాబ్దాలు గడిచినా, సాంకేతికత పెరిగినా.. ఈ సినిమా సృష్టించిన 'మాస్ మేనియా' మాత్రం తెలుగు సినీ చరిత్రలో చెక్కుచెదరకుండా ఉంది.












Click it and Unblock the Notifications