జగన్‌పై గెలవడమా, మెజారిటీయా: కాంగ్రెసు వ్యూహం ఏమిటి?

వైయస్ కుటుంబంతో అక్కడి ప్రజలకు ఉన్న సంబంధం కాంగ్రెసును నష్టపరిచేవే. వైయస్ మరణం తర్వాత కాంగ్రెసు తనను ఏకాకే చేసిందన్న ఆరోపణలు జగన్ ప్రజల్లోకి బాగా తీసుకు వెళుతున్నారు. అది పూర్తిగా అబద్దమైనప్పటికీ దానిని ప్రజలలోకి తీసుకు వెళ్లడంలో మాత్రం జగన్ ముందున్నాడని పలువురు యోచిస్తున్నారు. వివేకా కాంగ్రెసు వైపే ఉన్నప్పటికీ జగన్‌ను ఇటు కుటుంబ సభ్యులు, అటు పార్టీ ఏకాకీ చేసిందన్న భావన ప్రజలలో కలిగించేందుకే జగన్ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. అయితే అంతే స్థాయిలో జగన్ బయటకు వెళ్లడానికి కాంగ్రెసు కారణం కాదని ప్రజలలోకి తీసుకు వెళ్లే ప్రయత్నాలు అధికార పార్టీ నుండి కొరవడింది. ఇదొక్కటే కాంగ్రెసుకు జీర్ణించుకోలని విషయంగా పరిగణిస్తోంది.
ఈ నేపథ్యంలో పులివెందుల నుండి వైయస్ వివేకానందరెడ్డి బరిలో దిగుతుండగా కడప నుండి మాత్రం కందుల రాజమోహన్ రెడ్డిని దించే యోచనలో కాంగ్రెసు పార్టీ ఉంది. అయితే వైఎస్ మరణం, పార్టీనుండి బయటకు వెళ్లడం, ఏకాకిగా మారడం వంటివి జగన్‌పై ప్రజలకు సానుభూతి కల్గించేందుకు ఉపయోగపడతాయి. అంతేకాకుండా యంగ్ అయిన జగన్ యూత్‌ను ఎక్కువగా ఆకట్టుకుంటాడు. ఈ కారణంగా పులివెందుల, కడపలలో గెలుపు కోసం కాంగ్రెసు పార్టీ భారీ వ్యూహాలు రచిస్తోంది. ఎలాగైనా రెండు నియోజకవర్గాలలో నెగ్గి జగన్‌కు అక్కడ ప్రాధాన్యం లేదని చెప్పాలని భావిస్తోంది. రెండు స్థానాలలో గెలవలేక పోయినా జగన్ పోటీ చేసే కడప పార్లమెంటునైనా కైవసం చేసుకొని జిల్లా ప్రజలు కాంగ్రెసు వెంటే ఉన్నారని చూపాలని పార్టీ భావిస్తోంది. జగన్ ప్రాబల్యం తండ్రి ఉన్నంత వరకే చెప్పాలని చూస్తుంది.
అనుకోని పరిస్థితులలో రెండు స్థానాలు ఓడిపోయినా జగన్ మెజారిటీని మాత్రం భారీగా తగ్గించాలని చూస్తుంది. 2004లో వైయస్ వివేకానందరెడ్డికి లక్షా 31వేల మెజారిటీ వస్తే జగన్‌కు లక్షా 80వేలకు పైగా మెజార్టీ వచ్చింది. అయితే కాంగ్రెసు ఓడినా జగన్ మెజారిటీని మాత్రం సాధ్యమైనంత తగ్గించి 2014 ఎన్నికల వరకు కాంగ్రెసు పార్టీని పుంజుకునే ప్రయత్నాలు చేయాలనే యోచనలో కాంగ్రెసు పార్టీ ఉన్నట్టుగా తెలుస్తోంది. సానుభూతి ఓట్లు జగన్‌కు పడతాయనే భావనలో కాంగ్రెసు నేతలు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన మెజారిటీ అయినా భారీగా తగ్గించాలని వారు భావిస్తున్నారు.