కోదండరామ్‌కు కెసిఆర్ చెక్, కొత్త తెలంగాణ వేదికకు ప్రయత్నాలు

సమావేశానికి ముందు కాంగ్రెసు, తెలుగుదేశం, తెరాస, బిజెపిలకు చెందిన తెలంగాణ నాయకులు అంతర్గతంగా సమావేశమై కోదండరామ్ నాయకత్వంలోని జెఎసి స్థానంలో కొత్త వేదికను ఏర్పాటు చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. కోదండరామ్ నాయకత్వానికి స్వస్తి చెప్పాలనే ప్రతిపాదన తెరాస నుంచే వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నెల 15వ తేదీన సమావేశమై ఉమ్మడి వేదికకు రూపకల్పన చేయాలని రాజకీయ పార్టీల నాయకులు అనుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు కేంద్ర మంత్రి చిదంబరం ప్రకటన వచ్చిన తర్వాత తిరిగి కేంద్రం వెనక్కి మళ్లడాన్ని వ్యతిరేకిస్తూ అన్ని రాజకీయ పార్టీల తెలంగాణ శాసనసభ్యులు రాజీనామా చేయాలని రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్ ప్రతిపాదించారు. దానికి కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు అంగీకరించలేదు. దీంతో ఆ రెండు పార్టీలను జెఎసి నుంచి వెలి వేశారు.
ఐదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తయిన తర్వాత తెలంగాణపై దృష్టి సారిస్తామని తమ పార్టీ అధిష్టానం తమకు హామీ ఇచ్చిందని, తాము మే 10వ తేదీని గడువుగా విధించామని, ఆ గడువులోగా తెలంగాణ అంశాన్ని తేల్చకపోతే జూన్ మొదటివారంలో రాజీనామాలకు సిద్ధంగా ఉన్నామని ఆదివారం జరిగిన సమావేశంలో కాంగ్రెసు ప్రజాప్రతినిధులు చెప్పినట్లు సమాచారం. తాము కూడా రాజీనామాలకు సిద్ధంగా ఉన్నామని తెలుగుదేశం తెలంగాణ ప్రజాప్రతినిధులు చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవడానికి అన్ని రాజకీయ పార్టీల తెలంగాణ నాయకులు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని, అందుకు తెలంగాణ జెఎసి స్థానంలో మరో సంస్థ కావాలని అభిప్రాయపడినట్లు చెబుతున్నారు. ఈ కొత్త వేదిక ఆధ్వర్యంలో పెద్ద యెత్తున సభ నిర్వహించి ఉమ్మడిగా రాజీనామాల విషయం ప్రకటించాలని అనుకున్నట్లు తెలుస్తోంది. దీంతో కోదండరామ్ నాయకత్వానికి తిలోదకాలు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications