నాగం పాదయాత్రకు చంద్రబాబు చెక్: టిడిపి తెలంగాణ చైతన్య యాత్ర

మే 9వ తేదీ నుంచి నాగం పాదయాత్రకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. అయితే నాగం తన యాత్రలో తెలంగాణపై చంద్రబాబువిశ్వసనీయతను ప్రశ్నించే అవకాశం ఉండటంతో నాగంకు ధీటుగా తెలంగాణ ప్రజాప్రతినిధులను రంగంలోకి చంద్రబాబు దించనున్నట్టుగా తెలుస్తోంది. తెలంగాణలో తమకు 37 మంది ఎమ్మెల్యేలుండగా వీరిలో ముగ్గురు నలుగురు నాగం యాత్రకు మద్దతు పలికే అవకాశముందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో నాగంకు దీటుగా తెలంగాణ స్వరాన్ని వినిపించేందుకు ఇతర నేతలు సిద్ధమవుతున్నారు. 2008లో చేసిన తీర్మానం, 2009లో పార్టీ మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలకు పార్టీ కట్టుబడే ఉందని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని బాబు తెలంగాణ ప్రజా ప్రతినిధులకు సూచించినట్లుగా తెలుస్తోంది.
యువ శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి, సీనియర్ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు తదితరులతో తెలంగాణ ఉద్యమ కమిటీ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. తెలంగాణ కోసం గట్టిగా మాట్లాడుతున్న నాగంపై ఎలాంటి చర్యలు తీసుకున్న పార్టీకి తీవ్ర నష్టమని అందుకే ఆయనను ఏమనకుండా మిగతా ప్రజా ప్రతినిధులు మాత్రం తెలంగాణకు కట్టుబడి ఉన్నామనే విషయాన్ని ప్రజలలోకి తీసుకు వెళ్లాలనే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. చర్యలు తీసుకోకుండానే తెలంగాణలో ఏకాకిని చేసేలా వ్యూహం రచించారు. నాగం కన్నా ముందే తెలంగాణ ఎమ్మెల్యేలు చైతన్య యాత్రలు మొదలుపెట్టే అవకాశాలూ ఉన్నాయి. అంతేకాదు భవిష్యత్తులో తెలంగాణ జేఏసీతో సహా ఇతరత్రా కార్యక్రమాలకు టీడీపీ అధ్వర్యంలో ఏర్పడే కొత్త కమిటీ సభ్యులే హాజరవుతారు.












Click it and Unblock the Notifications