జగన్ వర్గానికి ఇక చెక్: నోటీసులు పంపిన డిప్యూటీ స్పీకర్!

నోటీసు అందిన వారం రోజుల్లోగా ఫిర్యాదులో పేర్కొన్న అంశాలపై వివరణ ఇవ్వాలంటూ గడువు విధించారు. కడప జిల్లాకు చెందిన ఆదినారాయణరెడ్డి, అమరనాథ్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, వరంగల్ జిల్లాకు చెందిన కొండా సురేఖలపై సీఎల్పీ గురువారం ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆ నలుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ టిక్కెట్లపై గెలిచి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనడం, పార్టీ అధ్యక్షురాలిని విమర్శించడం వంటి కారణాలతో వారిపై అనర్హత వేటు వేయాలని కోరారు. దీనిపైనే డిప్యూటీ స్పీకర్ వారికి నోటీసులు జారీచేశారు.
రెండ్రోజుల పాటు తిరుపతి పర్యటనకు వెళ్ళి వచ్చిన ఆయన శనివారం సాయంత్రం అసెంబ్లీకి వచ్చాక నోటీసులు జారీ అయ్యాయి. వారం తర్వాత ఎమ్మెల్యేల నుంచి వచ్చే వివరణను పరిశీలించి డిప్యూటీ స్పీకర్ తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. కాంగ్రెస్ శాసనసభా పక్షం ఫిర్యాదుతోపాటు, ఇచ్చిన సాక్ష్యాధారాలను పరిగణనలోకి తీసుకుని ఈ అంశాన్ని అతి త్వరగా పరిష్కరించాలని ఆయన భావిస్తున్నట్లు తెలిసింది. నలుగురు ఎమ్మెల్యేలు గత ఏడాది కాలంగా నిర్వహించిన పార్టీ వ్యతిరేక కార్యకలాపాలపై సీఎల్పీ పూర్తి ఆధారాలతో కూడిన నివేదికను డిప్యూటీ స్పీకర్‌కు సమర్పించింది.
వారు వివిధ సందర్భాల్లో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా చేసిన వ్యాఖ్యలతో కూడిన పత్రికల క్లిప్పింగులు, వీడియో సీడీలను జతపరిచింది. నలుగురిపై అనర్హత వేటు వేయడానికి సరిపడా సాక్ష్యాధారాలు సమర్పించామని, ఇందులో నుంచి వారు తప్పించుకునే అవకాశమే లేదని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.