చిరంజీవికి కాంగ్రెసు మార్కు దెబ్బ, మింగుడు పడని రాజకీయం

విలీనం విషయాన్ని ఎఐసిసి కార్యాలయంలో ప్రకటించాలని, సభలు వద్దని గులాం నబీ ఆజాద్ చెప్పడంతో చిరంజీవి అవాక్కయ్యారని అంటున్నారు. ఢిల్లీలోని ఎఐసిసి కార్యాలయంలో కాకపోతే హైదరాబాదులో అయినా సరేనని ఆయన చెప్పారని సమాచారం. ఎఐసిసి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తామని ఆజాద్ చిరంజీవికి చల్లగా చెప్పారని తెలుస్తోంది. దీన్ని చెప్పడానికి చిరంజీవి అప్పటి ఇంచార్జీ వీరప్ప మొయిలీ వద్దకు వెళ్లి చిరంజీవి మొర పెట్టుకున్నా ఫలితం కనిపించలేదని తెలుస్తోంది. తాను ఇప్పుడు తాను రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీని కాదని, అన్నీ ఆజాదే నిర్ణయిస్తారని చెప్పి మొయిలీ తప్పించుకున్నారని అంటున్నారు.
చిరంజీవిని కలవడానికి కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా ఇష్టంగా లేరని చెబుతున్నారు. చిరంజీవికి అంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదని ఆమె ఇప్పుడు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వాన్ని వైయస్ జగన్ కూలుస్తారని అనుకున్నప్పుడు హైదరాబాదులోని చిరంజీవి వద్దకు కేంద్ర మంత్రి ఆంటోనీని పంపి ఆహ్వానించిన సోనియా ఇప్పుడు చిరంజీవిని చూడడానికి ముఖం చాటేస్తున్నారని అంటున్నారు. మొత్తం మీద చిరంజీవికి కాంగ్రెసు మార్కు రాజకీయం రుచి తెలిసిందనే వ్యాఖ్య వినిపిస్తోంది.












Click it and Unblock the Notifications