న్యూఢిల్లీ: జాతీయ చలన చిత్ర అవార్డులను నిర్మాత జెపి దత్తా గురువారం సాయంత్రం ప్రకటించారు. సల్మాన్ ఖాన్ నటించిన దబాంగ్ ఉత్తమ వినోదాత్మక చిత్రంగా ఎంపికైంది. ఉత్తమ చిత్రంగా మలయాళం సినిమా అడమింతే మకాన్ అబు చిత్రం ఎంపికైంది. అదే చిత్రంలో నటించిన సలీం కుమార్‌కు ఉత్తమ నటుడి అవార్డు లభించింది. ఉత్తమ క్రీడా చిత్రంగా బాక్సింగ్ లేడీస్ ఎంపికైంది. ఉత్తమ నాన్ ఫీచర్ ఫిల్మ్ అవార్డు ది జర్మ్‌కు దక్కింది. ఉత్తమ కుటుంబ చిత్రంగా లవ్ ఇన్ ఇండియా ఎంపికైంది. ఉత్తమ సైన్స్, టెక్నాలజీ చిత్రంగా హార్ట్ టు హార్ట్ ఎంపికైంది. సామాజిక సమస్యలపై ఉత్తమ చిత్రంగా చాంపియన్స్ ఎంపికైంది. ట్రాఫికింగ్ ఉత్తమ సాంఘిక చిత్రం ఆవార్డును గెలుచుకుంది.
ఉత్తమ విద్యా విషయక చిత్రంగా అద్వైతం (తెలుగు) ఎంపికైంది. ఉత్తమ పర్యావరణ చిత్రంగా ఐరన్ ఈజ్ హాట్ ఎంపికైంది. ఉత్తమ నటిగా బాదూ బ్యాండ్ బాజా చిత్రంలో నటనకుగాను మితాలి జగ్తాప్ వారతావ్ ఎంపికైంది. ఉత్తమ తొలి చిత్రంగా బాదూ బ్యాండ్ బాజా ఎంపికైంది. అడమింటే మకాన్ అబూ చిత్రం నర్గీస్ దత్ అవార్డును కూడా గెలుచుకుంది. హెజ్జెగలు ఉత్తమ బాలల చిత్రంగా ఎంపికైంది. హర్ష్ మాయర్, శంతను రంగ్నేకర్, నచీంద్ర, వివేక్ చబూస్కర్ ఉత్తమ బాల నటులుగా ఎంపికయ్యారు.