హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అడ్డు కాదని వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ నేత గోనె ప్రకాశ్ రావు గురువారం విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. ఆర్టికల్ 3 ప్రకారం పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టక పోతే క్యాబినెట్ ఆమోదంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకునే అవకాశం ఉందని గోనె ప్రకాశ్ రావు చెప్పారు.
డిసెంబర్ 9న కేంద్ర ప్రభుత్వం మోస పూరిత ప్రకటన చేసిందని ఆయన ఆరోపించారు. ప్రత్యేక తెలంగాణ ప్రకటించిన పదిహేను రోజుల్లోనే మళ్లీ వెనక్కి తగ్గిందన్నారు. తెలంగాణ ప్రజలను మోసం చేసిందన్నారు. రాష్ట్రం రావణకాష్టంలా మారడానికి కారణం కేంద్ర ప్రభుత్వమే అన్నారు.