ఉప ముఖ్యమంత్రిగా దామోదర, పిసిసి అధ్యక్షుడి పదవి ఆంధ్రకు?
State
oi-Srinivas G
By Srinivas
|
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీ యాత్ర కారణంగా రాష్ట్ర కాంగ్రెసు నేతల్లో ఆసక్తి నెలకొంది. చాలా రోజులుగా నాన్చుతున్న ఉప ముఖ్యమంత్రి పదవి, స్పీకర్, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుల విషయం తేలే అవకాశం ఉందని భావిస్తున్నారు. అంతేకాదు త్వరలో మంత్రివర్గం విస్తరణ కూడా ఉంటుందని నేతలు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అధిష్టానం నుండి కూడా ఆ మేరకు సూచనలు వస్తున్నట్లుగా తెలుస్తోంది. గవర్నర్ కోటాలోని ఎమ్మెల్సీలపై కూడా పలువురు ఆసక్తి కనబరుస్తున్నారు. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన పూర్తయిన తర్వాత వీటిపై పూర్తిగా తేలనుందని ఈ పదవులు అన్నీ భర్తీ కానున్నాయని నేతలు అభిప్రాయపడుతున్నారు. ఎంతోకాలంగా భర్తీకి నోచుకోని పీసీసీ అధ్యక్ష పదవితోపాటు ఉప ముఖ్యమంత్రి, స్పీకర్, మండలి చైర్మన్, డిప్యూటీ చైర్మన్, గవర్నర్ కోటా కింద నామినేట్ చేసే ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు పేర్లు ప్రకటించే అవకాశం ఉందని ఆశావహులు భావిస్తున్నారు.
దీనిపై ఆదివారం అధిష్ఠానంతో కిరణ్ పలు దఫాలు చర్చించారు. పిసిసి అధ్యక్ష పదవి ఏ ప్రాంతం వారికి, ఎవరికి ఇవ్వాలనే విషయమై అధిష్ఠానంతో ఆదివారం మరో దఫా చర్చ జరుగుతుందని చెబుతున్నారు. ఈ పదవికి తెలంగాణకు చెందిన పొన్నాల లక్ష్మయ్య, షబ్బీర్ అలీ, సంభాని చంద్రశేఖర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సర్వే సత్యనారాయణ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ప్రధానంగా పొన్నాల, షబ్బీర్ అలీ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఉప ముఖ్యమంత్రి పదవి మంత్రి దామోదర రాజనరసింహకు దాదాపు ఖరారైనట్లుగా తెలుస్తోంది. అయితే ఉప ముఖ్యమంత్రి పదవి తెలంగాణ వారికి ఇస్తే పిసిసి పీఠాన్ని ఆంధ్రా ప్రాంతానికి ఇవ్వాలని అక్కడి నేతలు డిమాండ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనికి మంత్రులు బొత్స సత్యనారాయణ, కన్నా లక్ష్మీనారాయణ, డొక్కా మాణిక్య వరప్రసాద్‌ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇక స్పీకర్ పదవి నాదెండ్ల మనోహర్‌కు దాదాపు ఖరారైనట్లే. డిప్యూటీ స్పీకర్‌గా ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరు కూడా వినిపిస్తుంది.