నాగం పద్ధతి మార్చుకో, లేదంటే వేటు తప్పదు: రేవంత్‌రెడ్డి హెచ్చరిక
State
oi-Srinivas G
By Srinivas
|
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే నాగం జనార్ధన్ రెడ్డిపై ఆ పార్టీ యువ శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి ఆదివారం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నాగం తన పద్ధతి మార్చుకోవాలని లేదంటే చర్యలు తీసుకోవడానికి కూడా వెనుకాడేది లేదని హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమం ముసుగులో పార్టీని దెబ్బ తీసే విధంగా నాగం ప్రవర్తిస్తున్నారని ఆయన విమర్శించారు. పార్టీ జెండా పక్కన పెట్టి సొంత ఇమేజ్ పెంచుకోవడం కోసం ఇలాంటి చర్యలు చేపడితే సరికాదని హెచ్చరించారు. ముప్పయ్యేళ్లుగా పార్టీ యువతకు, మహిళలకు, బిసి, ఎస్సీ, ఎస్టీలకు మంచి ప్రాధాన్యత కలిగించిందన్నారు. అలాంటి పార్టీని మోసం చేయడం నాగంకు తగదన్నారు.
1989లో టిడిపిపైనే నాగం పోటీ చేసినప్పటికీ సహృదయంతో 1994లో మళ్లీ సీటు ఇచ్చిన విషయం గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణ టిడిపి కూడా సిద్ధంగా ఉందని అన్నారు. తమ నియోజకవర్గాల్లోని ద్వితీయ స్థాయి నేతలకు నాగం ఫోన్ చేసి మాపైకి ఉసిగొల్పుతున్నారని ఆరోపించారు. ఈ నెల 25న తెలంగాణ టిడిపి ఆధ్వర్యంలో తెలంగాణ భేరీ ఉంటుందని ప్రకటించారు.