మేం చరిత్ర హీనులమే, తెలంగాణ కోసం దేనికైనా సిద్ధం: ఎంపీ పొన్నం
State
oi-Srinivas G
By Srinivas
|
హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధించుకోక పోతే తాము చరిత్ర హీనులమే అవుతామని కరీంనగర్ జిల్లా కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ చెప్పారు. తెలంగాణ సాధిస్తామనే నమ్మకం తమకు ఉందన్నారు. తెలంగాణ కోసం తమ పోరాటం కొనసాగుతుందన్నారు. తెలంగాణ ఇస్తుందని కాంగ్రెసు పార్టీపై తమకు విశ్వాసం ఉందన్నారు. రెండో ఎస్సార్సీపై రాద్దాంతం వద్దన్నారు. పార్టీ రెండో ఎస్సార్సీ వేస్తుందన్న ఖచ్చితమైన సమాచారం ఏమీ లేదన్నారు. ఒకవేళ రెండో ఎస్సార్సీ వేసినా మార్పించే శక్తి తమకు ఉందన్నారు.
కేవలం అది వార్తే కానీ పార్టీకి అలాంటి ఉద్దేశ్యం లేదన్నారు. కేవలం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాన్ని ఆధారంగా చేసుకొని తెలంగాణకు ముడి పెట్టవద్దని కోరారు. తెలంగాణపై ఇప్పటికై తాము కేంద్రమంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ గులాం నబీ ఆజాద్‌కు వివరించామన్నారు. పార్టీ ప్రతిస్పందన కోసమే తాము ఎదురు చూస్తున్నామన్నారు. తెలంగాణపై త్వరలో పార్టీ నిర్ణయం తీసుకుంటుందన్న నమ్మకం తమకు ఉందన్నారు. ఒకవేళ పార్టీ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోకుంటే తాము దేనికైనా సిద్ధమన్నారు.