రాజీవ్ గాంధీ హత్యలో డిఎంకె హస్తం: జయలలిత సంచలన వ్యాఖ్యలు
National
oi-Srinivas G
By Srinivas
|
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడిఎంకె అధినేత్రి జయలలిత మంగళవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. దివంగత ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్య కేసులో కరుణానిధి నేతృత్వంలోని ద్రవిడ మున్నెట్ర కజగం (డిఎంకె) పాత్ర ఉందని చెప్పి సంచలం సృష్టించారు. రాజీవ్ గాంధీ హత్య కేసులో డిఎంకె తెర వెనుక పాత్ర పోషించిందని ఆమె ఆరోపించారు. రాజీవ్ గాంధీ హత్య కేసు ఫైలును క్లోజ్ చేశారని దానిని మరోసారి తెరిపించి మళ్లీ విచారణ జరిపించాలని ఆమె డిమాండ్ చేశారు. మళ్లీ విచారణ జరిపిస్తే డిఎంకె తెర వెనుక పాత్ర బయట పడుతుందని అన్నారు. కాగా 1991 మే 21వ తేదిన నాటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీని ఎల్‌టిటిఈ హతమార్చిన విషయం తెలిసిందే. ఓ మహిళ బాంబు రూపంలో వచ్చి రాజీవ్‌ను హత్య చేశారు. ఆ హత్య తమిళనాడులోనే నాటి ఎన్నికల సమయంలో జరిగింది.
తనకు కూడా ప్రాణ భయం ఉందని ఆమె చెప్పారు. 2జి కుంభకోణంలో అరెస్టయిన డిఎంకె ఎంపీ కనిమొళికి బెయిలు ఇవ్వవద్దని జయలలిత డిమాండ్ చేశారు. కనిమొళి మహిళ అయినంత మాత్రాన బెయిలు ఇవ్వాలని కోరటం సరైనది కాదన్నారు. ఆమె విషయంలో చట్టం తన పని తాను చేసుకు పోతుందన్నారు. ప్యారిస్‌లో భారతీయుడు ఎవరూ కూడా అరెస్టు అయినట్లు తనకు హోంమంత్రిత్వ శాఖ నుండి ఎలాంటి సమాచారం రాలేదన్నారు. డిఎంకె పథకాలు కొనసాగించాలా వద్దా అనే విషయంపై మంత్రివర్గం నిర్ణయం తీసుకుంటుందని అన్నారు.