చంద్రబాబును కావాలనే వైయస్ జగన్ రెచ్చగొట్టి, ఉసిగొల్పుతున్నారా?

తన వెంట నడుస్తున్న కాంగ్రెసు, ఇతర పార్టీల శానససభ్యులతో ప్రభుత్వాన్ని పడగొట్టడం సాధ్యం కాదనే విషయం జగన్‌కు తెలిసిపోయిందని చెప్పడంలో ఆవాస్తవం లేదు. తాను ప్రభుత్వాన్ని పడగొట్టాలంటే తన వెంట వస్తున్న శాసనసభ్యుల సంఖ్య సరిపోదనే విషయం జగన్‌కు తెలుసు. నారా చంద్రబాబు నాయుడు అవిశ్వాస తీర్మానం పెడితే తన వెంట నడుస్తున్న శాసనసభ్యులతో పాటు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శానససభ్యులు ప్రభుత్వం పడిపోవడానికి సహకరిస్తారనేది ఆయన ఆలోచన. అయితే, చంద్రబాబు అందుకు సిద్ధంగా లేరు. ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టి ప్రభుత్వాన్ని కూల్చడం వల్ల మధ్యంతర ఎన్నికలు వస్తే తాము గెలుస్తామని విశ్వాసం చంద్రబాబుకు లేదు. అటు వైయస్ జగన్, ఇటు కెసిఆర్ కొట్టుకుపోతారనేది ఆయన అంచనా. అందుకే చంద్రబాబు అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించడం లేదనేది రాజకీయ విశ్లేషకుల అంచనా.
చంద్రబాబు ఉద్దేశం జగన్‌కు తెలియంది కాదు. అయితే, రెచ్చగొట్టడం వల్ల చంద్రబాబు అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించడానికి ముందుకు వస్తే మంచిదే. రాకపోతే కాంగ్రెసుతో చంద్రబాబు కుమ్మక్కయ్యారనే విషయం ప్రజల్లోకి వెళ్తుందని ఆయన అనుకుంటున్నారు. ఇందులో భాగంగానే శనివారం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత అంబటి రాంబాబు మరో తీవ్రమైన వ్యాఖ్య చేశారు. చంద్రబాబు కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్‌తో చర్చలు జరిపారని, ప్రభుత్వాన్ని కాపాడుతానని చంద్రబాబు హామీ ఇచ్చారని ఆయన అన్నారు. ఇంత తీవ్రమైన వ్యాఖ్యలకు చంద్రబాబు ప్రతిస్పందన ఎలా ఉంటుందనేది ఒక విషయమైతే, తాను కుమ్మక్కు కావడం లేదని ప్రకటించుకోవడానికైనా అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తారేమోనని జగన్ ఆశ మరో విషయం. మొత్తం మీద చంద్రబాబును ప్రభుత్వాన్ని పడగొట్టడానికి జగన్ ఆయుధంగా ఎంచుకోవాలని అనుకుంటున్నట్లు అర్థమవుతోంది.