సిఎం కిరణ్ కుమార్ రెడ్డి తీరుపై మాజీ సిఎం నేదురుమల్లి అసంతృప్తి
State
oi-Srinivas G
By Srinivas
|
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి న్యూఢిల్లీలో విరుచుకు పడ్డారు. సింఎం కాంగ్రెసు పార్టీలో ఇతరుల నుండి సలహాలు స్వీకరించే పరిస్థితిలో లేరని నేదురుమల్లి జనార్దన్ రెడ్డి సోమవారం విలేకరులతో మాట్లాడుతూ విచారం వ్యక్తం చేశారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీతో భేటీ అయిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి అస్తవ్యస్తంగా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీని చక్కదిద్దాల్సిన ఆవశ్యకత ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. సోనియాగాంధీతో రాష్ట్ర పార్టీ పరిస్థితిపై సవివరంగా చర్చించినట్లు ఆయన చెప్పారు.
రాష్ట్రంలో పార్టీ భవిష్యత్తుపై దృష్టి సారించాలని ఆమెకు సూచించినట్లు చెప్పారు. ఉప ముఖ్యమంత్రిపై తుది నిర్ణయం అధిష్టానిదేనని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఒక ప్రాంతం నుండి ముఖ్యమంత్రిగా ఉంటే మరో ప్రాంతం నుండి పిసిసి అధ్యక్షుడు ఉండాలన్న నిబంధన ఏమీ లేదని అన్నారు. కాగా సోనియాగాంధీతో పార్టీలోని పదవుల భర్తీపై చర్చించినట్లు కూడా తెలుస్తోంది.