కంగు తిన్న వైయస్ జగన్, చంద్రబాబు వ్యూహానికి చిత్తు

అవిశ్వాస తీర్మానానికి తెలుగుదేశం పార్టీ నోటీసు ఇవ్వడంతోనే జగన్ తమ పార్టీ నేతలతో సమావేశమయ్యారు. చంద్రబాబు అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తే తాము ప్రభుత్వాన్ని కూల్చడానికి సిద్ధంగా ఉన్నామని జగన్ పదే పదే చెబుతూ వచ్చారు. ఈ స్థితిలో జగన్ సత్తా ఏమిటో చూపించడానికే చంద్రబాబు అవిశ్వాస తీర్మానం ప్రతిపాదనకు ముందుకు వచ్చినట్లు చెబుతున్నారు. జగన్‌కు బలం లేదు, సత్తా లేదని చూపించడానికే చంద్రబాబు ఈ పనికి పూనుకున్నట్లు చెబుతున్నారు. అవిశ్వాస తీర్మానం ప్రతిపాదనలో ఏ విధమైన రాజకీయం, వ్యూహం లేదని తెలుగుదేశం నాయకులు అంటున్నారు. ఎవరినో ఉద్దేశించి ఇందుకు తాము పూనుకోవడం లేదని వారంటున్నారు. మహానాడుకు ముందే ఈ నిర్ణయం తీసుకున్నామని చెబుతున్నారు.
తాజా పరిణామాల నేపథ్యంలో వైయస్ జగన్ గురువారం సాయంత్రం పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. రేపు శుక్రవారం తన వర్గానికి చెందిన శాసనసభ్యులతో సమావేశమవుతారు. తమ వైపు ఎంత శాసనసభ్యులు వస్తారనే విషయంపై జగన్ గురువారంనాటి సమావేశంలో చర్చించారు. శాసనసభ్యుల కోటా కింద జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాదిరిగానే జగన్ అవిశ్వాస తీర్మానం విషయంలో దెబ్బ తింటారనే మాట కూడా వినిపిస్తోంది. ఈ పరిస్థితిని గమనించే కాంగ్రెసు శాసనసభ్యులు ఆత్మప్రబోధానుసారం ఓటు వేస్తారని భావిస్తున్నట్లు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత కొణతాల రామకృష్ణ చెప్పారు.
తమకు మ్యాజిక్ ఫిగర్ కన్నా ఒక ఎమ్మెల్యే ఎక్కువే ఉన్నారని ఈ మధ్యనే వైయస్ జగన్ వర్గానికి చెందిన కాంగ్రెసు శానససభ్యుడు బాలినేని శ్రీనివాస రెడ్డి అన్నారు. సందర్భం వస్తే తమ సత్తా ఏమిటో చూపుతామని కూడా జగన్ వర్గం శానససభ్యులు అంటూ వస్తున్నారు. వారివి గాలి మాటలేనని తేల్చేయడానికే చంద్రబాబు అవిశ్వాస తీర్మానం ప్రతిపాదనకు ముందుకు వచ్చారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. మరో మూడేళ్ల పాటు శాసనసభ్యులుగా కొనసాగడానికి అవకాశం ఉన్న ప్రస్తుత పరిస్థితిలో ప్రభుత్వాన్ని కూల్చడానికి ముందుకు వస్తారా అనేది కూడా అనుమానమే. మొత్తంగా జగన్ రాజకీయ పరిపక్వతకు అవిశ్వాస తీర్మానం పరీక్ష పెట్టబోతోంది. జనగ్ ముఖ్య నేతలతో జరిపిన సమావేశానికి శాసనసభ్యులు మేకపాటి చంద్రశేఖర రెడ్డి, శ్రీనివాసులు, అమర్నాథ్ రెడ్డి హాజరయ్యారు.