చంద్రబాబు టార్గెట్ వైయస్ జగనే, అవిశ్వాస ప్రతిపాదన ఉద్దేశం అదే

కాంగ్రెసుతో కుమ్మక్కయ్యారని ఆరోపిస్తూ చంద్రబాబును ఇరకాటంలో పెట్టడానికి జగన్ ప్రయత్నించారు. అంతేకాకుండా, ప్రభుత్వాన్ని కూల్చడానికి చంద్రబాబు భయపడుతున్నారని, మధ్యంతరం వస్తే గెలవలేమని చంద్రబాబుకు భయం పట్టుకుందని వ్యాఖ్యానించారు. దీంతో చంద్రబాబు ఆత్మరక్షణలో పడినట్లే కనిపించారు. అయితే, ఒక్కసారిగా చంద్రబాబు వైయస్ జగన్‌కు షాక్ ఇచ్చినంత పని చేశారు. ఊహకు అందని రీతిలో అవిశ్వాస తీర్మానం అస్త్రాన్ని ప్రయోగించారు. కంగు తినడం జగన్ వంతైంది. చంద్రబాబు ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తారని ఆయన ఊహించి ఉండరు.
ప్రభుత్వాన్ని పడగొట్టడం చంద్రబాబు ఉద్దేశం కాదని, అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించడం ద్వారా చంద్రబాబు కాంగ్రెసుతో కుమ్మక్కయ్యారని మరోసారి రుజువైందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు అంటున్నారు. అవిశ్వాస తీర్మానం సందర్భం ప్రభుత్వాన్ని నిలబెట్టాలనేదని వైయస్ జగన్‌కు చెందిన సాక్షి దినపత్రికలోని ఓ వార్తాకథనం విమర్శించింది. మరో ఆరు నెలల పాటు ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించకుండా ఉండడానికి చంద్రబాబు ఇప్పుడు దాన్ని ప్రతిపాదిస్తున్నారని వ్యాఖ్యానించింది.