జగన్! ఎందుకు ప్రభుత్వంపై కన్నెర చేయలేదు: చంద్రబాబు ప్రశ్న
State
oi-Pratapreddy
By Pratap
|
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా ధ్వజమెత్తారు. తాము ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం ప్రస్తావనను తేకుండా స్పీకర్ నాదెండ్ల మనోహర్ శానససభను నిరవధికంగా వాయిదా వేయడంపై తన పార్టీ శాసనసభ్యులతో కలిసి గవర్నర్ నరసింహన్‌కు చంద్రబాబు శనివారం సాయంత్రం ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. కన్నెర్ర చేస్తే ప్రభుత్వం పడిపోతుందని, తన దయాదాక్షిణ్యాలపై ప్రభుత్వం మనుగడ సాగిస్తోందని అని ఉపన్యాసాలిచ్చిన వైయస్ జగన్ ఇప్పుడు ఎందుకు వెనకడుగు వేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. స్పీకర్‌గా కాంగ్రెసు అభ్యర్థిని ఓడించి ఉంటే ప్రభుత్వం నడిచే పరిస్థితి ఉండేది కాదని ఆయన అన్నారు.
ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నామని ఇప్పటికైనా జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులు గవర్నర్ వద్దకు వెళ్లి చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అవిశ్వాస తీర్మానంపై చర్చకు వెంటనే శాసనసభను సమావేశపర్చాలని తాము గవర్నర్‌ను కోరినట్లు ఆయన తెలిపారు. శానససభ నడిచిన తీరుపై తాము ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వం, స్పీకర్ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించిట్లు ఆయన ఆరోపించారు. సభా సంప్రదాయాలను ఉల్లంఘించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేశారని ఆయన విమర్శించారు. స్పీకర్ ఎన్నికతో బలనిరూపణ అయిందంటూ కప్పదాట్లు వేస్తున్నారని ఆయన అన్నారు. ప్రోటెం స్పీకర్ జెసి దివాకర్ రెడ్డి నిబంధనలను పాటించలేదని ఆయన విమర్శించారు.