స్పీకర్ ఎన్నికకు వైయస్ విజయమ్మ దూరం, ప్రజలకు బహిరంగ లేఖ

"రాష్ట్ర అసెంబ్లీలో శనివారం స్పీకర్ ఎన్నిక సందర్భంగా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలిగా నా మనస్సాక్షిని చంపుకోలేక ఓటింగ్‌లో పాల్గొనడం లేదు. ఎందుకంటే.. నా భర్త, రాష్ట్ర ప్రజల ఆశాజ్యోతి, దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన కాలంలో పేద ప్రజలు, దళిత, బడుగు, బలహీన, మైనారిటీవర్గాలు, రైతన్నలు, మహిళలు, విద్యార్థుల ముఖాల్లో చిరునవ్వు చూడాలని ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిన విషయం తెలిసిందే. మళ్లీ 2009లో జరిగిన ఎన్నికల్లో ప్రతిపక్షాలన్నీ ఏకమై మహాకూటమిగా ఏర్పడినా, గెలుపు ఓటముల బాధ్యత తనపై వేసుకొని కాంగ్రెస్ పార్టీని ఒంటిచేత్తో అధికారంలోకి తీసుకువచ్చారు. కానీ వైఎస్‌ఆర్ మరణానంతరం ఈ ప్రభుత్వం అన్ని అభివృద్ధి, సంక్షేమ పథకాలను తుంగలో తొక్కి పేదల జీవితాలతో చెలగాటం ఆడుతోంది. అందుకే ఈ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయింది. ఈ సమయంలో ప్రజల పక్షాన నిలబడవలసిన బాధ్యత నాపై ఉంది. కానీ ఈ ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టే సంఖ్యా బలం మా పార్టీకి లేదు. అందువలన ప్రధాన ప్రతిపక్ష మైన టీడీపీ ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానం నోటీసును స్పీకర్ ఆమోదించి, దానిపై చర్చకు అనుమతిస్తారని ఆశిస్తున్నాను. నా భర్త సభను, సభా సంప్రదాయాలను, స్పీకర్‌ను ఎంతగానో గౌరవించేవారు. నూతన సభాపతి పార్టీలకతీతంగా మా మనోభావాలనూ గౌరవించి అవిశ్వాస తీర్మానాన్ని చర్చకు అనుమతిస్తారని నేను కూడా విశ్వసిస్తున్నాను."