తెలంగాణ కాదంటే రాజీనామాలే, చివరి పర్యటన: టి-కాంగ్రెసు ఆల్టిమేటం

తెలంగాణ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తి లేదన్నారు. జూలైలోగా తెలంగాణపై స్పష్టమైన ప్రకటన రావాలన్నారు. లేకుంటే ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు అందరూ రాజీనామాలకు దిగి ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని హెచ్చరించారు. తమకు తెలంగాణపై డెడ్ లైన్ పెట్టడానికి జెఏసి నేతలు ఎవరని ప్రశ్నించారు. తెలంగాణ విషయంలో కేంద్రమంత్రి జైపాల్ రెడ్డిపై కూడా ఒత్తిడి తీసుకు రావాలని పలువురు ప్రజాప్రతినిధులు సమావేశంలో సూచించినట్లుగా తెలుస్తోంది. తెలంగాణ కోసం రాజీలేని పోరాటం చేస్తామని అన్నారు. కేంద్రం డిసెంబర్ 9 ప్రకటనకు కట్టుబడి ఉండాలన్నారు. తెలంగాణ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష అన్నారు. ఒక్క విజిలేస్తే తెలంగాణ రాదన్నారు. పార్లమెంటులో బిల్లు పెట్టి రాజ్యాంగ్ ప్రక్రియ ద్వారా రావాల్సి ఉంటుందన్నారు. కాంగ్రెసు నేతలను నిర్బందిస్తామని అనడాన్ని కెకె ఖండించారు. తెలంగాణపై ప్రణబ్, అహ్మద్ పటెల్‌లకు లేఖలు రాస్తున్నామని చెప్పారు.
ఈ పర్యటనలో ఫలితం తేలనుందని ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. అధిష్టానం సానుకూలంగా స్పందించకుంటే అందరం కలిసి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఇదే అధిష్టానానికి చివరి అవకాశం అన్నారు. అధిష్టానం తెలంగాణకు అనుకూలంగానే ఉంటుందనే విశ్వాసం తమకు ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు పొన్నం ప్రభాకర్, వివేక్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మంత్రులు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు.