అభివృద్ధి జరగాలి కదా: పవర్ ప్లాంట్ల నిర్మాణంపై ముఖ్యమంత్రి
State
oi-Pratapreddy
By Pratap
|
శ్రీకాకుళం: పవర్ ప్లాంట్ల ఏర్పాటును ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమర్థించుకున్నారు. ప్రభుత్వం ప్రజల పక్షాననే ఉంటుంది కానీ, అభివృద్ధిని అడ్డుకోకూడదని ఆయన అన్నారు. శ్రీకాకుళం అధికారులతో సమీక్ష అనంతరం ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. పవర్ ప్లాంట్ల నిర్మాణంలో రైతులకు అన్యాయం జరగకుండా చూస్తామని ఆయన చెప్పారు. రైతులకు తగిన నష్టపరిహారం చెల్లించిన తర్వాతనే పవర్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని ప్రారంభిస్తామని ఆయన హామీ ఇచ్చారు. పవర్ ప్లాంట్ల నిర్మాణం వల్ల విద్యుత్తు చౌకగా దొరుకుతుందనే విషయాన్ని గ్రహించాలని ఆయన సూచించారు. విద్యుత్ ప్రాజెక్టులు ఉత్పత్తి చేసే కరెంటులో తగిన వాటా కోసం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతామని ఆయన అన్నారు.
సంక్షేమ పథకాలను ఆపేస్తామని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని ఆయన అన్నారు. అభివృద్ధి పనులను వేగవంతం చేయడానికి పటిష్టమైన చర్యలు తీసుకుంటామని, సంక్షేమ పథకాలను కొనసాగిస్తామని ఆయన చెప్పారు. రాజకీయాలను పక్కన పెట్టి అభివృద్ధికి సహకరించాలని ఆయన కోరారు. స్థానిక సంస్థల ఎన్నికలు సకాలంలో జరగాల్సిన అవసరం ఉందని, రిజర్వేషన్ల జాబితాను ఎన్నికల సంఘానికి సకాలంలో అందిస్తామని ఆయన అన్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో లోటుపాట్లను గుర్తించి, వాటిని నివారించడానికి చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.