తిరుపతి: తిరుపతిలోని శివజ్యోతినగర్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ వివాహితను దుండగులు ముక్కలు ముక్కలుగా నరికి టీవీ బాక్స్‌లో పెట్టారు. ఇంటి నుంచి దుర్వాసన వస్తుండడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు ఇంటి తలుపులు తీసి చూడగా టీవీ బాక్స్‌లో మహిళ శవం కనిపించింది. ఈ సంఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. నెల్లూరుకు చెందిన సునీత అనే మహిళ భర్తతో విడాకులు తీసుకుని తిరుపతిలోని శివజ్యోతి నగర్‌లో ఉంటుంది.
సునీత ఇళ్లలో పని చేస్తూ జీవితం సాగిస్తోంది. అయితే, అప్పుడప్పుడు ఆమె మామ ఇంటికి వచ్చి వెళ్తూ ఉండేవాడు. శుక్రవారం సాయంత్రం అతను సునీత ఇంటికి వచ్చాడని, ఇద్దరి మధ్య గొడవ జరిగిందని అంటున్నారు. శుక్రవారం రాత్రే ఆమె హత్య జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. మామతో ఉన్న అక్రమ సంబంధమే ఆమె ప్రాణం తీసినట్లు భావిస్తున్నారు. మామనే ఆమెను హత్య చేసి ఉంటాడా, భర్త దుండగులను పురమాయించి ఆమెను హత్య చేయించాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.