చంద్రబాబు ప్లాన్: టిడిపి సమైక్యాంధ్రవాదులు సైలెంట్

పార్టీలో సీమాంధ్ర నాయకులు సమైక్యావాదం వినిపిస్తే తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకులు, నాగం జనార్దన్ రెడ్డి చేస్తున్న విమర్శలు నిజమనే అభిప్రాయం తెలంగాణ ప్రాంతంలో మరింతగా బలపడుతుందని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. దీంతో మౌనం వహించాల్సిందిగా సమైక్యావాదులకు ఆయన సూచించినట్లు చెబుతున్నారు. తెలంగాణ రణభేరీ సభలతో తెలంగాణలో పాగా వేయడానికి పార్టీ తెలంగాణ ప్రాంత నాయకులు ప్రయత్నిస్తున్న సమయంలో సమైక్యవాదులు నోరు విప్పితే సమస్య పెరుగుతుందని అనుకుంటున్నారు.
కాంగ్రెసు పార్టీ అధిష్టానం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా లేదని, ప్రాంతీయ మండలిని ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు సాగిస్తోందని సంకేతాలు అందుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కానప్పుడు పార్టీలోని సమైక్యవాదులు ముందుకు రావాల్సిన అవసరం లేదని, ఒకవేళ పరిస్థితి మారి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా నిర్ణయం వెలువడితే అప్పుడు ఆలోచించవచ్చునని చంద్రబాబు అనుకుంటున్నట్లు చెబుతున్నారు. సమైక్యాంధ్ర నినాదంతో కాంగ్రెసు సీమాంధ్ర నాయకులు జులై మొదటివారంలో ఢిల్లీకి వెళ్లడానికి సమాయత్తమవుతున్నారు. ఈ స్థితిలో మౌనం వహించి, సమస్యను కాంగ్రెసుకు వదిలేయడమే మంచిదని చంద్రబాబు భావిస్తున్నారు.