అనంతపురం: పెట్రో ధరల పెంపును నిరసిస్తూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ రేపు శుక్రవారం అనంతపురం జిల్లా కేంద్రంలో మహాధర్నా నిర్వహించనున్నారు. పెంచిన పెట్రో ఉత్పత్తుల ధరలను తగ్గించాలని జగన్ డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్యాస్ ధరలు భారీగా పెంచి సామాన్యులపై మోయం లేని భారం మోపాయని ఆయన గురువారం అన్నారు. తన ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.
అనంతపురం జిల్లాలో ఓదార్పుయాత్ర చేస్తున్న జగన్ గురువారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో యల్లనూరు చేరుకున్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన దివంగత మహానేత వైఎస్సార్ విగ్రహాన్ని అశేష జనవాహిని సాక్షిగా ఆవిష్కరించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఆయన గత కొద్ది రోజులుగా అనంతపురం జిల్లాలో ఓదార్పు యాత్ర నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.