హైదరాబాద్: చిరంజీవి ఏదైనా నిర్ణయం తీసుకుంటే స్ట్రాంగ్‌గా తీసుకుంటాడని దానిపై తాను ఏమీ ఖచ్చితంగా చెప్పలేనని అయితే ఆయనను ఒప్పించడానికి మాత్రం ప్రయత్నాలు చేస్తానని నాగబాబు గురువారం అన్నారు. చిరంజీవి కనీసం ఒక్క సినిమాలోనైనా నటించాలని డిమాండ్ చేస్తూ చిరంజీవి అభిమానులు గురువారం ప్రజారాజ్యం పార్టీ కార్యాలయం నుండి ర్యాలీ నిర్వహించి చిరు ఇంటి ముందు ధర్నా చేసిన విషయం తెలిసిందే. నాగబాబు బయటకు వచ్చి అభిమానులను బుజ్జగించే ప్రయత్నాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చిరంజీవి మరో రెండు మూడు సినిమాలు తీయాలని నాకూ ఉందని అయితే అన్నయ్య ఏదైనా నిర్ణయం తీసుకుంటే అంతే అని అన్నారు. ఆయనకు మేం సమాధానం చెప్పమన్నారు. వారు అభిమానులు కాబట్టి వారికి కాస్త స్వాతంత్రం ఎక్కువ ఉంటుందన్నారు.
రాజకీయాలు, సినిమాలకు రెండింటికి న్యాయం చేయలేననే ఉద్దేశ్యంతోనే చిరంజీవి సినిమాలు తీయనని చెప్పినట్టుగా తెలుస్తోందని అన్నారు. అయితే నేను అభిమానులకు అన్నయ్యతో సినిమా చేయిస్తానని మాట ఇవ్వడం లేదని కానీ ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేస్తానని మాత్రం చెబుతున్నానని అన్నారు. అభిమానులు చేస్తున్న డిమాండులో న్యాయం ఉందని అన్నారు. చిరంజీవి ఒక్క సినిమా చేసినంత మాత్రాన రాజకీయంగా ఎలాంటి నష్టం ఉండదన్నారు. కాగా నాగబాబు రెండు రోజులు సమయం అడిగారని అప్పుడు కూడా చిరంజీవి నటించనంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు.