అనంతపురం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మానవత్వం లేదని అందుకే ఇష్టానుసారంగా ధరలు పెంచి సామాన్య ప్రజలపై ధరల భారం మోపుతుందని వైయస్సాఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం అనంతపురం జిల్లాలోని మహాదీక్షలో విరుచుకు పడ్డారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలో కేంద్రం ధరలు పెంచినప్పుడు ఆ ధరలను రాష్ట్ర ప్రభుత్వమే భరించేలా వైయస్ నిర్ణయం తీసుకున్నారని గుర్తు చేశారు. కాని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం మాత్రం కేంద్రం వేసిన భారాన్ని ప్రజలపైనే వేయాలని చూస్తుందన్నారు.
గతంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పెట్రోలు, డీజిల్‌పై పన్నులు పెంచి ప్రజల నడ్డి విరిచారన్నారు. కాంగ్రెసు ప్రభుత్వంలో సామాన్యుడు బతకలేని పరిస్థితి నెలకొందన్నారు. నిత్యం ధరలు పెంచుకుంటూ పోతే ప్రజలు ఎలా బతకాలని ఆయన ప్రశ్నించారు. త్వరలో వైయస్ సుభిక్ష పాలన వస్తుందన్నారు.