హైదరాబాద్: తెలంగాణ ప్రాంత కాంగ్రెసు ప్రజాప్రతినిధులు అందరూ రాజీనామాలకు సిద్ధపడిన ఈ తరుణంలో మెదక్ జిల్లా సంగారెడ్డి శాసనసభ్యుడు తూర్పు జయప్రకాశ్ రెడ్డి మాత్రం రాజీనామాకు ముందుకు రావడం లేదు. శుక్రవారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్సులో సమావేశం అయిన అనంతరం టి-కాంగ్రెసు నేతలు మీడియా సమావేశం నిర్వహించి తామంతా ఈ నెల 4న రాజీనామాలు చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే జగ్గారెడ్డి మాత్రం తాను ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీనామా చేసే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. తన నియోజకవర్గ ప్రజలు రాజీనామాలు కోరుకోవడం లేదన్నారు. రాజీనామాలు చేయకుండా తాను తెలంగాణ కోసం ఉద్యమిస్తానని చెప్పారు. తన నియోజకవర్గంలోని ప్రజలంతా తెలంగాణ కోసం ఉద్యమిస్తున్నారని అన్నారు.
మిగిలిన వారు రాజీనామా చేస్తామని నిర్ణయించుకున్నారని దానిపై తానేమీ స్పందించనని అన్నారు. తాను వ్యక్తిగతంగా రాజీనామాకు సిద్ధం లేనని, ఇతర నేతలపై స్పందించనని అన్నారు. కాగా ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రులు సబితారెడ్డి, దానం నాగేందర్, ముఖేష్ గౌడ్, పార్లమెంటు సభ్యులు వి హనుమంతరావు, సర్వే సత్యనారాయణ, అంజన్ కుమార్ యాదవ్, బలరాం నాయక్ తదితరులు గైర్హాజరయ్యారు. మంత్రి దానం నాగేందర్ తాను సమావేశానికి రానని స్పష్టంగా చెప్పారు. దానం వంటి రాజధాని పరిసర ప్రాంతాలలోని నేతలు రాజీనామాకు సిద్ధం కాకపోవచ్చునని తెలుస్తోంది.