హైదరాబాద్: తెలంగాణ ప్రాంత కాంగ్రెసు పార్టీ రాజీనామాల వెనుక తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు కుట్ర ఉన్నదని కాంగ్రెసు పార్టీ మంత్రి టిజి వెంకటేష్ ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ అన్నారు. కెసిఆర్ వెనుకుండి ముందు టి-కాంగ్రెసు నేతలను పెడుతున్నారని వారిని బలి చేస్తున్నారని ఆరోపించారు. రాజీనామాలతో రాజ్యాంగ సంక్షోభం రాదన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వస్తే రాష్ట్రం మరో బీహార్‌లా మారుతుందన్నారు. కెసిఆర్ తెలంగాణ పేరుతో వ్యాపారుల్ని దోచేస్తున్నారని అన్నారు.
రాష్ట్రపతి పాలన వచ్చినప్పటికీ రాష్ట్రంలో కాంగ్రెసు పాలన కొనసాగుతుందని టిజి అన్నారు. 164 జివో ప్రకారం కాంగ్రెసు పాలన సజావుగా సాగుతుందన్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు ఒక్క మంత్రి లేకుండా పరిపాలన కొనసాగించారన్నారు. ఈ నెల 5న సీమాంధ్ర నేతలు న్యూఢిల్లీ వెళతామని చెప్పారు. బృందంలో 10 మంది మంత్రులు, 20 మంది ఎమ్మెల్యేలు ఉంటారని చెప్పారు. తామంతా సమైక్యాంధ్రకే కట్టుబడి ఉన్నామని చెప్పారు.