తెలంగాణ నేతలను కాంగ్రెసు హైకమాండ్ రెచ్చగొట్టిందా?

తెలంగాణపై నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేయడం ద్వారా, తెలంగాణ నాయకులను మేనేజ్ చేయడం ద్వారా తెలంగాణ ఉద్యమాన్ని నీరు గార్చవచ్చునని కేంద్ర హోం శాఖ నివేదిక ఇచ్చిందని, ఈ రకంగా తప్పుడు నివేదికలు సమర్పించారని ఆయన అన్నారు. కేంద్ర హోం మంత్రి చిదంబరం సోమవారంనాటి మాటలు కూడా కాంగ్రెసు తెలంగాణ ప్రజాప్రతినిధుల రాజీనామాలను తేలికగా తీసుకున్నట్లే ఉన్నాయి. రాజీనామాలు ఆశ్చర్యకరం కాదని ఆయన అన్నారు. దీనిపై కూడా తెలంగాణ కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు తీవ్రంగా మండిపడ్డారు. కె. కేశవ రావు, మందా జగన్నాథం వంటి పార్లమెంటు సభ్యులు చిదంబరంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
పైగా, ప్రజలకే కాకుండా, కాంగ్రెసు అధిష్టానానికి కూడా తెలంగాణ ప్రజాప్రతినిధులు మాటలపై నిలబడతారనే నమ్మకం లేదు. రాజీనామాలు చేసినప్పటికీ వారు వెనక్కి తగ్గుతారని కాంగ్రెసు అధిష్టానం పెద్దలు అనుకుంటున్నట్లు అర్థమవుతోంది. రాజీనామాలు ఆమోదం పొందకుండా ఆపేసి, తెలంగాణ ప్రజాప్రతినిధులను బుజ్జగించవచ్చునని ఇప్పటికీ వారు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, తెలంగాణ ప్రజాప్రతినిధులు కొద్ది మంది వెనక్కి తగ్గినా మెజారిటీ తగ్గే అవకాశాలు లేవని అంటున్నారు. తమపై ఉన్న చులకనభావాన్ని వారు తీవ్రంగా పరిగణిస్తున్నట్లు అర్థమవుతోంది. అలాగే, తెలంగాణ ప్రజల్లో విశ్వాసం పాదుకొల్పుకోవడానికి రాజీనామాలకు కట్టుబడి ఉండడమే మార్గమని వారు అనుకుంటున్నట్లు కూడా తెలుస్తోంది.
సీమాంధ్ర నాయకులకు పార్టీ అధిష్టానం ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ తమను వివక్షకు గురిచేస్తోందనే అభిప్రాయం కూడా బలంగానే ఉంది. పైగా, రాజీనామాలు చేయకపోయినా ఇప్పుడు పెద్దగా పదవులు వచ్చే అవకాశాలు కూడా లేవు. కొంత మంది మంత్రి పదవులు పోయే పరిస్థితి కూడా ఉంది. ఈ స్థితిలో రాష్ట్ర కాంగ్రెసు పార్టీ వ్యవహారాలను చక్కదిద్దే అవకాశం ఇవ్వడం వల్ల నష్టపోతామనే అభిప్రాయం కూడా వారిలో ఉంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వైపు వెళ్లే ప్రజాప్రతినిధులు కూడా ఇందులో ఉన్నారు. దానివల్ల తెలంగాణ ప్రజాప్రతినిధులను మేనేజ్ చేయడం కాంగ్రెసు అధిష్టానానికి అంత సులభం కాదు.












Click it and Unblock the Notifications