హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి షాక్ ఇవ్వాలని రంగారెడ్డి జిల్లా కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు నిర్ణయించుకున్నారు. ముఖ్యమంత్రి కార్యక్రమాన్ని బహిష్కరించాలని వారు నిర్ణయించుకున్నారు. ముఖ్యమంత్రి శనివారం రంగారెడ్డి జిల్లా మేడిపల్లి గ్రామంలో వనమహోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ఆయన మొక్కలు నాటుతారు. అయితే, ఈ కార్యక్రమానికి హాజరు కాకూడదని కాంగ్రెసు కార్యకర్తలు నిర్ణయించుకున్నారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో వారు ఈ నిర్ణయానికి వచ్చారు.
కాగా, జిల్లా మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఇంచార్జీ మంత్రి శ్రీధర్ బాబు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశాలు లేవని అంటున్నారు. తెలంగాణ కోసం రాజీనామాలు చేయడంతో తెలంగాణవాదుల ఆగ్రహాన్ని చవి చూడాల్సి వస్తుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి హాజరు కాకూడదని మంత్రులు నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇదిలా వుంటే, ముఖ్యమంత్రి కార్యక్రమం నేపథ్యంలో ఆటంకాలు కల్పిస్తారనే ఉద్దేశంతో పోలీసులు పలువురు తెలంగాణవాదులను ముందస్తు చర్యగా అరెస్టు చేశారు. వారిని ఘట్కేసర్ పోలీసు స్టేషన్‌కు తరలించారు.