• search
  • Live TV
కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

తెలంగాణ సెంటిమెంట్‌ను గౌరవిస్తాం: వైయస్ జగన్

By Pratap
|

YS Jagan
కడప: తెలంగాణ సెంటిమెంటును తాము గౌరవిస్తున్నామని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. రాజకీయ తీర్మానంపై పార్టీ ప్లీనరీలో జరిగిన చర్చ అనంతరం ఆయన శనివారం ప్రసంగించారు. తెలంగాణ ఇచ్చే శక్తి లేదు, ఆపే శక్తి తమకు లేదని ఆయన అన్నారు. రాష్ట్రం రావణకాష్టంగా మారడానికి, వందల మంది చనిపోవడానికి, ఆస్తుల నష్టం జరగడానికి కారణం పూర్తిగా కేంద్ర ప్రభుత్వమేనని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని విభజించాలన్నా, కలిపి ఉంచాలన్నా పూర్తి హక్కులు కేంద్ర ప్రభుత్వానికే ఉన్నాయని, అది తెలిసి కూడా తమ జీవితాలతో చెలగాటం ఆడుతోందని, ఈ చెలగాటం ఆపేసి వైషమ్యాలను పెంచకుండా అందరి మనోభావాలను పరిగణనలోకి తీసుకుని ఒక మంచి మార్గం తెలియజెప్పాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికే ఉందని ఆయన అన్నారు. పంచాయతీలో కేంద్ర ప్రభుత్వం పెద్ద మనిషిగా కూర్చుని ఉందని, అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని మంచి అభిప్రాయం తీసుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని ఆయన అన్నారు.

తెలంగాణ అంశంపై మిగతా పార్టీల మాదిరిగా ఉండవచ్చునని, మిగతా పార్టీల మాదిరిగా ఓ కమిటీ వేసేద్దామని, ఈలోగా పుణ్యకాలం దాటిపోతుందని తనకు చాలా మంది చెప్పారని ఆయన అన్నారు. తెలంగాణ అంశంపై రాజకీయ పార్టీలు, నాయకులు చేస్తున్న విన్యాసాలు తనకు బాధ కలిగిస్తున్నాయని ఆయన అన్నారు. మాట ఇస్తే, కష్టమైనా నష్టమైనా దాని మీద నిలబడాలని ఆయన అన్నారు. 125 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెసు పార్టీ తానే అధికారంలో ఉందని, కాంగ్రెసు నాయకత్వం ఈ ప్రాంతానికి చెందినవారితో ఈ మాట, ఆ ప్రాంతంవారితో ఆ మాట మాట్లాడిస్తోందని ఆయన విమర్శించారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తెలంగాణకు అనుకూలమని తీర్మానం చేసిందని, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)తో పొత్తు పెట్టుకున్నారని, తెలంగాణకు అనుకూలంగా సోనియా గాంధీ నిర్ణయం తీసుకుంటే యు - టర్న్ తీసుకున్నారని, చంద్రబాబునాయుడిది రెండు నాలుకల ధోరణి అని ఆయన అన్నారు. ఏ ఒక్క పార్టీ అభిప్రాయాన్ని కూడా తాము ప్రభావితం చేసే పరిస్థితిలో తాము లేమని, ఒక బాధ్యత గల పార్టీగా ఒక నిర్ణయాన్ని చెప్పాల్సిన అవసరం ఉంటుందని ఆయన అన్నారు. తెలంగాణ చాలా సున్నితమైన అంశమని, ఆ ప్రాంతానికి వెళ్లి అక్కడి నాయకులు మీ వైఖరి ఏమిటని అడిగితే ఆ ప్రాంతానికి అనుకూలమని చెప్పక తప్పదని, ఈ ప్రాంతానికి వస్తే ఈ ప్రాంతానికి అనుకూలంగానే చెప్పాల్సి వస్తుందని ఆయన అన్నారు. తన అక్కలాంటి సురేఖమ్మ తన కోసం రాజీనామా చేశారని, తన కోసం మంత్రి పదవికి రాజీనామా చేసిన సురేఖమ్మ, తెలంగాణ కోసం శాసనసభా సభ్యత్వానికి రాజీనామా చేశారని, అంతటి సున్నితమైన అంశమని ఆయన అన్నారు. తెలంగాణపై చాలా ఆలోచనే చేశామని,

తనను, తన తల్లి వైయస్ విజయమ్మను అఖండ మెజారిటీతో గెలిపించిన ప్రజలకు జగన్ కృతజ్ఞతలు తెలిపారు. వైయస్సార్ సువర్ణ యుగాన్ని మళ్లీ తెస్తామని, కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా నడుచుకుంటామని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలని దేశానికే చాటి చెప్పిన నాయకుడు వైయస్సార్ అని ఆయన అన్నారు. వైయస్సార్ స్ఫూర్తిని కొనసాగిస్తామని ఆయన హామీ ఇచ్చారు. నాయకులు సూచించిన అంశాలపై తాను అధ్యయనం చేస్తానని ఆయన చెప్పారు. ఎన్నికల ప్రణాళికలో ప్రతి అంశానికీ ప్రాధాన్యం ఉంటుందని ఆయన చెప్పారు. పేదలకు ఇళ్లు, రేషన్ కార్డులు ఇవ్వలేని స్థితిలో ప్రస్తుత ప్రభుత్వం ఉందని ఆయన అన్నారు.

కొద్దిగా ఖర్చు పెడితే 43 సాగు నీటి ప్రాజెక్టులు పూర్తయ్యే స్థితిలో ఉన్నాయని, వాటిని ప్రభుత్వం మరిచిపోయిందని ఆయన అన్నారు. బిసిలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయస్సార్ కల్పించిన 34 శాతం రిజర్వేషన్లను ప్రభుత్వం అమలు చేయలేని స్థితిలో ఉందని ఆయన విమర్శించారు. అఖిల పక్ష సమావేశం పెట్టాలని అడిగితే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. అన్ని పార్టీలవాళ్లం ఒసి కోటా నుంచి పది శాతం బిసిలకు కేటాయిద్దామని సూచిస్తే పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. కోర్టులు, రాజ్యాంగం వంటి విషయాలను సాకుగా చూపిస్తూ స్థానిక సంస్థల ఎన్నికలను, బిసి రిజర్వేషన్లను పక్కన పెడుతోందని, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కూడా ప్రభుత్వంతో గొంతు కలుపుతోందని ఆయన అన్నారు.

ముస్లింలకు నాలుగు శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పిస్తామని ఆయన చెప్పారు. ఉప ఎన్నికల సమయంలో తనపై, తల్లిపై కాంగ్రెసు, తెలుగుదేశం రోజుకో అబద్ధం ఆడుతూ వచ్చారని ఆయన విమర్సించారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ముస్లిం సోదరుల్లో అభద్రతా భావం కల్పించడానికి తాము బిజెపితో పొత్తు పెట్టుకోబోతున్నట్లు కాంగ్రెసుతో కలిసి అబద్ధపు ప్రచారం చేశారని ఆయన అన్నారు. మత పార్టీలతో తాము పొత్తు పెట్టుకోబోమని ఆయన అన్నారు.

English summary
YSR Congress party president YS Jagan said that his party will honour Telangana sentiment.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X