హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తులపై సిబిఐ విచారణ జరిపించాలని హైకోర్టుకు వెళ్లడంలో ఏ విధమైన రాజకీయ కుట్ర లేదని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. జగన్ ఆస్తులపై సిబిఐ విచారణ జరగడం మంచిదేనని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. సిబిఐ విచారణ జరిపించాలనే అంశంపై వైయస్ జగన్ స్టే తెచ్చుకోకపోవడం మంచిదని ఆయన అన్నారు. వైయస్సార్ అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్ అక్రమాస్తులు సంపాదించారనే ఆరోపణలు ఉన్నాయని, ఆ ఆరోపణలు నిజమో కాదో తేలాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. చట్టం తన పని తాను చేసుకు పోతుందని ఆయన అన్నారు.
ఆరోపణలు వచ్చినప్పుడు ప్రజా జీవితంలో ఉన్నవారు విచారణ ద్వారా తమ నిజాయితీని నిరూపించుకోవాల్సి ఉంటుందని, గతంలో తనపై ఆరోపణలు వచ్చినప్పుడు తాను సిబిఐ విచారణ వేయించుకున్నానని ఆయన చెప్పారు. కేంద్ర మంత్రివర్గంలో ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయమేమీ జరగలేదని ఆయన అన్నారు. గతంలో కన్నా కేంద్ర మంత్రి వర్గంలో రాష్ట్రానికి ఎక్కువ ప్రాధాన్యమే ఉందని ఆయన అన్నారు. మంత్రివర్గ పునర్వ్యస్థీకరణలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రాతినిధ్యం కల్పించే విషయంలో రాష్ట్ర పరిస్థితుల ప్రభావం ఏమీ లేదని ఆయన అన్నారు. కేంద్ర మంత్రి పదవి చేపట్టబోతున్న కిశోర్ చంద్రదేవ్‌కు ఆయన ఫోనులో శుభాకాంక్షలు తెలిపారు. ఆయన రేపు బుధవారం ఢిల్లీకి వెళ్తున్నారు.