న్యూఢిల్లీ/ హైదరాబాద్: తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న ప్రస్తుత తరుణంలో తెలంగాణకు చెందిన పార్లమెంటు సభ్యులను మంత్రివర్గంలోకి తీసుకుంటే తప్పుడు సంకేతాలు వెళ్తాయని పార్టీ అధిష్టానం భావించి ఉంటుందని, అందుకే తనకు మంత్రి పదవి రాలేదని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత రాజ్యసభ సభ్యుడు వి. హనుమంత రావు అన్నారు. తెలంగాణకు చెందినవారికి మంత్రి పదవులు ఇస్తే తెలంగాణ సమస్యను పరిష్కరించకూడదని కాంగ్రెసు అధిష్టానం భావిస్తోందనే తప్పు సంకేతాలు ప్రజల్లోకి వెళ్తాయని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తమకు మంత్రి పదవి రాకపోవడంపై అసంతృప్తి ఏమీ లేదని ఆయన అన్నారు. తెలంగాణ నుంచి ఎవరికైనా మంత్రి పదవి ఇవ్వదలుచుకుంటే తన పేరు మొదట ఉంటుందని, గతంలో కూడా చివరి నిమిషంలో తన పేరు జాబితా నుంచి తొలగిందని ఆయన అన్నారు.
ప్రస్తుత పరిస్థితిలో తెలంగాణవారికి మంత్రి పదవులు రావడం కష్టమని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు జి. వివేక్ అన్నారు. తమకు పదవులు ముఖ్యం కాదని, తెలంగాణనే ముఖ్యమని ఆయన హైదరాబాదులో అన్నారు. తెలంగాణవారికి కేంద్ర మంత్రి వర్గంలో చోటు దక్కకపోవడం సంతోషకరమని మరో పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. అభివృద్ధి జరగకపోపడమే ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న ఉద్యమాలకు కారణమని మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న కిశోర్ చంద్రదేవ్ ఢిల్లీలో అన్నారు. గిరిజనుల అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన చెప్పారు.