అనంతపురం: భగనాన్ సత్యసాయి బాబా బ్రతికి ఉన్న రోజుల్లో ఒకరి చేతిలో బందీగా ఉండిపోయారని తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ ఆదికేశవులు నాయుడు శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశారు. బాబా చేపట్టిన సేవా కార్యక్రమాలు మరింత ముందుకు తీసుకు వెళ్లడానికి తనవంతు సాయం చేస్తానని అన్నారు. బాబా సమాధిని చూస్తుంటే తాను చివరి సమయంలో బాబాను దర్శించుకోలేదన్న ఆవేదన కలుగుతుందని అన్నారు. పుట్టపర్తిలో బాబా మహాసమాధి దర్శనం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.
కాగా ప్రశాంతి నిలయంలో సత్యసాయి బాబా మహా సమాధి దర్శనానికి శుక్రవారం నుండి భక్తులను అనుమతించారు. మహాసమాధి దర్శనం సందర్భంగా ప్రశాంతి నిలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. రెండు నెలల పాటు నిపుణులు ప్రత్యేకంగా నిర్మించిన సత్య సాయి మహా సమాధిని వేద పండితులు మంత్రోచ్ఛారణల మధ్య ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి గీతారెడ్డి, విహెచ్‌పి నేత అశోక్ సింఘాల్ పాల్గొన్నారు.