విజయవాడ: విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ రెడ్డి వైయస్సాఆర్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలను తరిమి కొట్టిన సంఘటన కృష్ణా జిల్లాలో శుక్రవారం చోటు చేసుకుంది. రెండు రోజుల క్రితం లగడపాటి రాజగోపాల్ దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదం విషయంలో విచారించ వలసి వస్తే ముందుగా జగన్‌ను విచారించాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. శుక్రవారం లగడపాటి కృష్ణా జిల్లాలోని మైలవరం పర్యటనకు వెళ్లారు.
అక్కడ వైయస్సాఆర్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు జగన్‌పై నిరాధార ఆరోపణలు చేశారంటూ లగడపాటి కారను అడ్డుకున్నారు. అయితే లగడపాటి వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కారు దిగకుండానే కాసేపు కూర్చుని తప్పుకోవాలని సూచించారు. కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. వారు ఎంతకు వినక పోవడంతో కారు దిగిన లగడపాటి వారిని తరిమి కొట్టారు. లగడపాటి అనుచరులు వారి కార్ల అద్దాలను పగులగొట్టారు.